అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహి అని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. సమైక్యవాదులకు కొమ్ముకాస్తూ, స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి పాలేరు సభలో టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన విషయం తెలిసిందే. టీడీపీ అభిమానులు బీఆర్ఎస్ను బొంద పెట్టాలని, గ్రామాల్లో ఆ పార్టీ గద్దెలను కూల్చాలని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తరఫున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ‘ఓటుకు నోటు’ దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి అన్నారు. ఎన్టీఆర్ ద్వేషించిన కాంగ్రెస్‌లో చేరి, నమ్మిన పార్టీకి, నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి అన్నారు.
Harish Rao | బీజేపీతో దోస్తీ
కేంద్రంలోని బీజేపీతో రేవంత్‌రెడ్డి చీకటి స్నేహాలు చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా బనకచర్ల (Banakacherla) లాంటి ప్రాజెక్టుల విషయంలో పొరుగు రాష్ట్రాలకు సపోర్టు చేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ సర్కార్‌ను వ్యతిరేకిస్తూ ఉంటే.. రేవంత్ మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్న టీడీపీపై బహిరంగంగా అభిమానం కురిపించడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ కూటమికి మేలు చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పగలు రాహుల్ గాంధీ జపం చేసే సీఎం, రాత్రి బీజేపీ, టీడీపీతో దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు.
Harish Rao | దిమ్మతిరిగిలా బదులిస్తాం
బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలని ముఖ్యమంత్రి బహిరంగంగా పిలుపునివ్వడం శాంతిభద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడమే అన్నారు. హోమ్ శాఖను నిర్వహిస్తున్న వ్యక్తి ఇంత బహిరంగంగా నేర చర్యలను, విద్వేషాలను రెచ్చగొడుతుంటే రాష్ట్ర డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేక, భౌతిక దాడులకు, ఆస్తుల ధ్వంసానికి పిలుపునివ్వడం సీఎం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ దిమ్మెలు కూలగొడితే రేవంత్ దిమ్మతిరిగేలా బదులిస్తామని పేర్కొన్నారు.