అక్షరటుడే, వెబ్‌డెస్క్: Medaram Jathara | మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అధికారికంగా పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆదివాసీలు గిరిజన సంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు.
సీఎం వెంట కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రివర్గ సహచరులు కూడా మేడారానికి చేరుకున్నారు. సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబంతో కలిసి వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవతలకు సారె సమర్పించి, మనవడు రేయాన్ష్‌తో కలిసి తులాభారం వేసి నిలువెత్తు బంగారాన్ని సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Medaram Jathara | ప్రత్యేక పూజలు..
మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా వనదేవతలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం (CM Revanth Reddy) మేడారంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. మంత్రి సీతక్క దేవతల ప్రసాదంతో పాటు చీరె సారెను సీఎం కుటుంబ సభ్యులు, మంత్రులకు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం రూ.251 కోట్లతో చేపట్టిన మేడారం అభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆదివారం సాయంత్రం మేడారం పర్యటన చేపట్టారు. జంపన్న వాగు సర్కిల్ వరకు సీఎం బస్సులో ప్రయాణిస్తూ, జాతరకు వచ్చే లక్షలాది భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.జాతర భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం, పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో సీసీ కెమెరాల అనుసంధానం, డ్రోన్ కెమెరాల వినియోగాన్ని పర్యవేక్షించారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భద్రత ఎలా పర్యవేక్షిస్తున్నారో పోలీసు ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు.
దాదాపు వెయ్యేళ్ల చరిత్రను ప్రతిబింబించేలా రాతి ప్రాకారాలు, శిలాతోరణాలతో చేపట్టిన గద్దెల ప్రాంగణ పునరుద్ధరణ పనులను సీఎం పరిశీలించారు. కోయ తెగల సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిఫలించేలా రూపొందించిన ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఆదివారం రాత్రి మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (State Cabinet Meeting) నిర్వహించారు. హైదరాబాద్ (Hyderabad) వెలుపల కేబినెట్ సమావేశం జరగడం తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారి. అనంతరం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ సమ్మక్క–సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు.