అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tilak Verma | 2025 ఆసియా కప్ ఫైనల్‌లో భారత జట్టు గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షాన్ని అందుకుంటున్నాడు.
పాకిస్థాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో, భారత్ 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ప్రతికూల పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ(Tilak Verma) ఒత్తిడిని తట్టుకుని అద్భుతంగా 69 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.తాజాగా హైదరాబాదుకు చేరుకున్న తిలక్ వర్మ, మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాడు.
Tilak Verma | చిరు సత్కారం..
క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి(Sports Minister Vakiti Srihari)తో కలిసి వెళ్లిన తిలక్‌కి సీఎం రేవంత్ స్వాగతం పలుకుతూ అభినందనలు తెలిపారు. అనంతరం సత్కారించారు. ఇక తాను సంతకం చేసిన క్రికెట్ బ్యాట్‌ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బహుమతిగా అందజేశారు తిలక్ వర్మ. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ ఎండీ సోనిబాల దేవి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక తిలక్ వర్మ ప్రదర్శనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందిస్తూ, సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. “మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను కంట్రోల్ చేశాడు. ఒత్తిడిలోనూ అతని ప్రశాంతత, ప్రతిభ స్ఫూర్తిదాయకం” అంటూ ప్రశంసించారు. అలాగే ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా తిలక్‌ను కొనియాడారు.
తిలక్ వర్మ ఫైనల్ మ్యాచ్‌లో చేసిన ఈ ఇన్నింగ్స్‌తో తనకున్న క్రికెట్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటికే రెండు అంతర్జాతీయ సెంచరీలు చేసిన తిలక్, ఈ మ్యాచ్‌ను తన ఫేవరెట్ ఇన్నింగ్స్‌గా అభివర్ణించాడు. అతని మెచ్యూరిటీ, కూల్ మైండ్‌గేమ్ దేశవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తిలక్ వర్మను క్రికెట్ విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు “టీమిండియాకు కొత్త ఆశాకిరణం”గా అభివర్ణిస్తున్నారు.