అక్షరటుడే, నిజాంసాగర్: Mla Laxmi Kantha Rao | మల్లూరు (mallur) గ్రామంలో సమస్యలను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును ఆదివారం వారు కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మల్లూరు గ్రామ శివారులోని సర్వే నం.765లో ఉన్న రైతుల భూసమస్యను పరిష్కరించాలని వారు కోరారు. మల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుండి మల్లూరు తండా బీటీ రోడ్డు వరకు ఫార్మేషన్ రోడ్డు నిర్మించాలని వారు వినతిపత్రంలో కోరారు. అలాగే ఏటిగడ్డ వద్ద సూదిరెడ్డి రాంరెడ్డి వ్యవసాయ పొలం వద్ద మాంజీర నదిపై హైలేవర్ బ్రిడ్జిని నిర్మించాల్సింగా వారు విన్నవించారు.
అదేవిధంగా మల్లూరు తండా రోడ్డు నుండి పల్లె శివారులోని వ్యవసాయ భూముల ప్రాంతానికి వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న మాసిరెడ్డి చెరువు కాలువపై వంతెన నిర్మాణం చేపట్టాలని సూచించారు. మల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School) ప్రహరీని నిర్మింపజేయాలని విన్నవించారు.
ఈ సమస్యలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఒంటరి శ్రీనివాస్ రెడ్డి, బుడిమి శ్రీనివాస్, పెద్ది అంజయ్య, నాగంపల్లి కృష్ణ, శ్రీధర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.