అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Soybean Farmers | వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోయాబిన్ రైతులకు ఊరట కలిగించే వార్త చెప్పారు. సోయాబీన్ కొనుగోలు పరిమితిని ఎకరాకు 7.62 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్లకు పెంచినట్లు ఆయన తెలిపారు. ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని ఆయన మార్క్ ఫెడ్ అధికారులను (Mark Fed Officers) ఆదేశించారు.
రాష్ట్రంలో 3.66 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగు చేసినట్లు అంచనా. సోయాబిన్ కొనుగోలు కోసం ప్రభుత్వం గతంలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. క్వింటాల్‌కు రూ.5,328 మద్దతు ధరతో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నారు. అయితే మొదట ఎకరాకు 7.62 క్వింటాళ్ల సోయాలను మాత్రమే కొనుగోలు చేశారు. దీనిపై రైతులు విజ్ఞప్తి మేరకు తాజాగా పది క్వింటాళ్లకు పెంచారు. అలాగే కౌలు రైతుల ఇబ్బందుల దృష్ట్యా ఆధార్ అథెంటికేషన్‌తో పాటు మొబైల్ OTPతో కూడా కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి (Tummala Nageswara Rao) ఆదేశించారు.
Soybean Farmers | ధాన్యం కొనుగోళ్లలో జాప్యం
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో నత్తనడకన ధాన్యం సేకరణ ప్రక్రియ సాగుతోంది. దీంతో రైతులు (Soybean Farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం చలితీవ్రత పెరిగింది. సాయంత్రం ఆరు అయిందంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. కానీ ధాన్యం కేంద్రాల్లో రైతులు చలిలో సైతం కాపలా పడుకుంటున్నారు. దీంతో అనారోగ్యానికి గురి అవుతున్నారు. ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు పలు చోట్ల లారీలు సక్రమంగా రావడం లేదు. మిల్లర్లు తరుగు పేరిట లారీ కొన్ని బస్తాలను కట్ చేస్తున్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారు.
