అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gig Workers | కేంద్ర ప్రభుత్వం (Central Government) గిగ్‌వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు అమలు చేస్తున్న 10 నిమిషాల డెలివరీని ఎత్తి వేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి మాండవీయ ఆదేశాలు జారీ చేశారు.
కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా (Union Minister Mandaviya) ప్రధాన ఆహార డెలివరీ, క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు ’10-నిమిషాల’ డెలివరీ నిబంధన తొలగించాలని మంగళవారం సూచించారు. డెలివరీ భాగస్వాముల భద్రత వేగం కంటే ముందు ఉండాలని నొక్కి చెప్పారు. మాండవియా బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో అధికారులతో చర్చలు జరిపారు. గిగ్‌వర్కర్ల భద్రత దృష్ట్యా వారి ప్లాట్‌ఫామ్‌లు, ప్రమోషనల్ మెటీరియల్ నుంచి కఠినమైన డెలివరీ గడువులను తొలగించాలని ఆయన వారికి సూచించారు.
Gig Workers | వెనక్కి తగ్గిన బ్లింకిట్
కేంద్ర మంత్రి సూచనల మేరకు ప్రముఖ డెలివరీ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ తన అన్ని బ్రాండ్ ప్లాట్‌ఫామ్‌ల నుండి “10-నిమిషాల డెలివరీ” క్లెయిమ్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. అన్ని కంపెనీలు తమ బ్రాండ్ ప్రకటనలు, సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్‌ల నుంచి డెలివరీ-సమయ నిబద్ధతలను తొలగిస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి. రద్దీగా ఉండే రోడ్లపై కఠినమైన గడువులను చేరుకోవడానికి తరచుగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న డెలివరీ భాగస్వాముల పని పరిస్థితులను మెరుగుపరచడంలో ఈ చర్య ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
Gig Workers | పని ఒత్తిడి
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారాలు (Food Delivery Platforms) వినియోగదారులను ఆకర్షించడానికి పది నిమిషాల్లో డెలివరీ చేస్తామని ప్రకటనలు ఇచ్చాయి. దీంతో గిగ్ వర్కర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. నగరాల్లో, భారీ ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో 10 నిమిషాల్లో డెలివరీ సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు డిసెంబర్లో సమ్మె చేశారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం వారి సంక్షేమం కోసం చర్యలు చేపట్టింది. దీంతో ఆయా సంస్థలు ఆ నిబంధనను తొలగించడానికి ముందుకు వచ్చాయి.