అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kadapa | సోషల్ మీడియా (Social Media)లో ఫేమస్ కావడానికి చాలా మంది ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఓ యువకుడు రీల్స్ చేస్తూ బైక్‌పై నుంచి పడి మృతి చెందాడు.
ఇటీవల పలువురు యువత సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు మంచి కంటెంట్‌తో ప్రజలకు చేరువ అవుతుంటే మరికొందరు బూతులు, అశ్లీలలను నమ్ముకున్నారు. ఇంకొందరు ప్రమాదకర స్టంట్లు చేస్తున్నారు. బైక్‌లు, కార్లతో స్టంట్లు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. అంతేగాకుండా రైలు కింద పడుకొని పలువురు రీల్స్ చేస్తున్నారు. తాజాగా కడప జిల్లా (Kadapa District)లో కొందరు యువకులు బైక్‌లతో స్టంట్లు చేశారు. ఈ క్రమంలో ముబారక్ (20) అనే యువకుడు కింద పడి చనిపోయారు
Kadapa | వ్యూస్ కోసం..
ప్రస్తుతం యువత సోషల్ మీడియాకు బానిసలు మారారు. తమ పోస్టులకు ఎక్కువ వ్యూస్ వస్తే సంబరపడి పోతున్నారు. ఇలా ఎక్కువ వ్యూస్ కోసం ముబారక్ తన స్నేహితుడితో కలిసి బుధవారం తెల్లవారుజాము స్కూటీపై వెళ్తూ ప్రమాదకరమైన స్టంట్లు చేశాడు. బండిని పైకి లేపుతూ వేగంగా వెళ్లారు. ఈ క్రమంలో బైక్ నియంత్రణ కోల్పోవడంతో ఇద్దరు కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడ్డ ముబారక్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న మరో యువకుడికి సైతం తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం బెంగళూరు (Bengaluru)లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కడప పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
యువత రీల్స్ (Youth Reels), సోషల్ మీడియా మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. రోడ్లపై ప్రమాదకరంగా విన్యాసాలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియా కోసం కన్న వారికి కడుపు కోత మిగుల్చొద్దని కోరుతున్నారు.