అక్షరటుడే, వెబ్డెస్క్ : Liquor Sales | ఈ ఏడాది విజయదశమి, గాంధీ జయంతి (Gandhi Jayanthi) ఒకే రోజు రావడంతో తెలంగాణ ప్రభుత్వం ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం, మాంసం అమ్మకాలను నిషేధిస్తూ ‘డ్రై డే’గా ప్రకటించింది. ఈ ప్రకటన మందు ప్రియుల్లో కొంత ఆందోళన కలిగించింది. అయితే పండగ రోజు డ్రైడే (Dry Day) కావడంతో బుధవారం మద్యం దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. ఫలితంగా ఒక్కరోజే రాష్ట్ర ఖజానాకు రూ.340 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది.
Liquor Sales | రికార్డ్ అమ్మకాలు..
సాధారణంగా తెలంగాణ (Telangana)లో రోజువారీ మద్యం అమ్మకాలు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు ఉంటే, దసరా పండుగ, డ్రై డే కలసి వచ్చిన నేపథ్యంలో ఆదివారం నుంచి బుధవారం వరకు ఈ విక్రయాలు అమాంతం పెరిగాయి. గత నాలుగు రోజుల గణాంకాల ప్రకారం ఆదివారం రూ.280 కోట్లు, సోమవారం రూ.290 కోట్లు, మంగళవారం రూ.300 కోట్లు విక్రయాలు జరగగా బుధవారం మాత్రం కొనుగోళ్లు బీభత్సంగా జరిగాయి. ఈ నేపథ్యంలో మద్యం షాపులు (Wine Shops) జనాలతో కిక్కిరిసిపోయాయి. డ్రై డే సందర్భంగా మద్యం (Liquor) దొరకదన్న ఆందోళనతో చాలామంది 4–5 రోజుల సరిపడా మద్యాన్ని ముందుగానే కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో దసరా జాతరలు, కుటుంబ వేడుకల కోసం కూడా ముందస్తుగా స్టాక్ చేసుకున్నారు.
ఇక మాంసం (Meat) దుకాణాల పరిస్థితి కూడా అలానే ఉంది. అక్టోబర్ 2న మూసి ఉంటాయని ముందుగానే విక్రయదారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ప్రజలు బుధవారం నాడు మాంసం దుకాణాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలో మాంసం విక్రయాల వద్ద కూడా రద్దీ కనిపించింది. మొత్తంగా, డ్రై డే ప్రకటన రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అటు నిబంధనలు పాటిస్తూ మద్యం విక్రయాలను ముందుగానే కొనుగోలు చేయడం, ఇటు పండుగ వాతావరణం కలసి వచ్చాయి. ఫలితంగా బుధవారం ఒకేరోజే మద్యం అమ్మకాల్లో రాష్ట్రం కొత్త రికార్డు నమోదు చేసింది.