అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పాతబస్తీలోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ (Rain Bazaar Police Station) పరిధిలో చోటు చేసుకుంది.
రెయిన్ బజార్ (Rain Bazaar)కు చెందిన మహమ్మద్ జునైద్ (30) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బుధవారం అర్ధరాత్రి అతడిని దుండగులు కత్తులతో విచక్షణరహితంగా పొడిచారు. దీంతో జునైద్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ జునైద్ మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital)కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Hyderabad | హత్యకు కారణం అదేనా
జునైద్‌ను హత్య చేసింది అతడి బంధువులేనని పోలీసులు గుర్తించారు. నిందితులు ఒమర్, అలీలు కలిసి అతడిపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. వీరి మధ్య కొంతకాలంగా వ్యాపార లావాదేవిల విషయమై గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఓ ఇంటి అమ్మకంపై కొంత కాలంగా జునైద్, ఒమర్‌ల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి మాట్లాడుకుందామని జునైద్‌ను ఒమర్, అలీ చోటాపూర్కు పిలిపించారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరగడంతో కత్తులతో జునైద్‌పై దాడి చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Hyderabad | పెరుగుతున్న నేరాలు
హైదరాబాద్ నగరంలో నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఓ ఏసీపీ, గన్‌మన్‌పై రౌడీ షీటర్ కత్తితో దాడికి యత్నించారు. పోచారం గోరక్షకుడిపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. బాలానగర్ పీఎస్ పరిధిలో ఓ రౌడీ షీటర్‌పై మరో రౌడీ షీటర్ కత్తితో దాడి చేశాడు. ఇలా నగరంలో కత్తిపోట్లు, కాల్పుల ఘటనలు తరచూ జరుగుతుండటంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఇటీవల ఆయన పలువురు పాత నేరస్తులను బైండోవర్ చేశారు. నేరాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
