అక్షరటుడే, వెబ్డెస్క్ : Danam Nagender | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామాకు సిద్ధం అని ప్రకటించారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేస్తానని చెప్పారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే (Khairatabad MLA)గా బీఆర్ఎస్ నుంచి దానం గెలుపొందారు.
అనంతరం ఆయన కాంగ్రెస్లో చేరారు. హస్తం పార్టీ (Congress Party) నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. స్పీకర్ విచారణకు ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు. కడియం శ్రీహరి (Kadiyam Srihari) తనకు సమయం కావాలని స్పీకర్ను కోరారు. అయితే దానం మాత్రం విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలో ఆయన రాజీనామాకు సిద్ధమని ప్రకటించడం గమనార్హం.
Danam Nagender | 11 ఎన్నికల్లో పోటీ చేశా
ఇప్పటికి 11 ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర తనకు ఉందని దానం తెలిపారు. అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయన్నారు. తన వైపు నుంచి వాదనలు వినిపిస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో పదేళ్ల పాటు సీఎంగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. సీఎం ఆదేశిస్తే రాజీనామా చేస్తానని.. ఎన్నికల్లో కొట్లాడటం తనకేమి కొత్త కాదన్నారు.
Danam Nagender | ఉప ఎన్నికలు వస్తాయా..
బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్లో చేరిన వారిపై అనర్హత వేయాలని ఆ పార్టీ పోరాడుతోంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో సైతం కేసు పెండింగ్లో ఉంది. అయితే మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పినా.. స్పీకర్ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఇటీవల కోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ చర్యలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. మిగతా ఎమ్మెల్యేలు తాము ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని చెబుతున్నారు. సాంకేతిక అంశాలతో వారు వేటు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. అయితే దానం మాత్రం ఏకంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేడయంతో ఆయనపై వేటు తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వేటు వేయకముందే ఆయనతో రాజీనామా చేయించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే దానం తాజా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
