అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలోని ఐటీఐ కళాశాల మైదానం సోమవారం రంగురంగుల ముగ్గులతో కళకళలాడింది. సంస్కార భారతి ఇందూరు శాఖ, ఇండియన్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలు, కళాశాల విద్యార్థులకు భారీ స్థాయిలో ముగ్గుల పోటీలు (rangoli competition) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని షీ టీం ఎస్సై స్రవంతి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.
Nizamabad City | ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
ఎస్సై స్రవంతి (Sub-Inspector Sravanthi) మాట్లాడుతూ, మహిళలు, విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. సమాజంలో ఆకతాయిల వేధింపులు ఉన్నా.. మొబైల్ ఫోన్ ద్వారా ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. విద్యార్థినుల రక్షణ కోసం షీ టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాజ్ కుమార్ సుబేదార్తో పాటు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంలో సంస్కార భారతి చేస్తున్న కృషిని కొనియాడారు.
ఇలాంటి సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు తమ కళాశాల ప్రాంగణాన్ని ఎల్లప్పుడూ కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఎం. సాయి తరుణ్ మాట్లాడుతూ.. నేటి ఉరుకుల పరుగుల బిజీ షెడ్యూల్‌లో కూడా సంప్రదాయాలను మర్చిపోకుండా ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో బ్యాంకు తరపున పూర్తి తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కన్వీనర్ నగుర్తి శంకర్, సాహిత్య విధా ప్రముఖ్ జి. ప్రసాద్, ప్రాంత కార్యదర్శి చామకూర శ్రీనివాస్ రెడ్డి, బి. మల్లేష్, రాధాకృష్ణ, కందకుర్తి ఆనంద్, నాగనాథ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. మహిళా శక్తి కన్వీనర్ మాధురి, ఉపాధ్యక్షులు వరలక్ష్మి, శశిరేఖ, మాధవి, శ్రీలత తదితర సంస్కార భారతి సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.