Homeతాజావార్తలుHydraa | హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు.. జూబ్లీహిల్స్​ ఎన్నిక కోసమేనా?

Hydraa | హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు.. జూబ్లీహిల్స్​ ఎన్నిక కోసమేనా?

హైదరాబాద్​లోని పలు కాలనీల ప్రజలు హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు చేపట్టారు. హైడ్రా చర్యలతో తమకు ముంపు బాధ తప్పిందని హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | హైదరాబాద్​ నగరంలో ప్రభుత్వ భూములు (government lands), చెరువులు, నాలాల పరిరక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైడ్రా ఏర్పాటు అయిన నాటి నుంచి వందల ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడింది. ఈ క్రమంలో చాలా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది.

చెరువులు, ప్రభుత్వ భూములు, నాలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు (Hydra officials) కూల్చి వేశారు. అయితే కూల్చివేతల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తమ ఇళ్లు కూల్చొద్దని పలువురు వేడుకున్నారు. అయితే హైడ్రా మాత్రం అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. త్వరలో జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) జరగనుంది. అయితే ఆది నుంచి బీఆర్​ఎస్​ పార్టీ హైడ్రాను వ్యతిరేకిస్తోంది. హైడ్రాతో నగరంలో రియల్​ ఎస్టేట్​ పడిపోయిందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Hydraa | కారు వర్సెస్​ బుల్డోజర్​

జూబ్లీహిల్స్​ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్​ (KTR) మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు కారుకు బుల్డోజర్​కు మధ్య​ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​కు ఓటు వేస్తే హైడ్రా బుల్డోజర్లు వచ్చి ప్రజల ఇళ్లు కూలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో పేదల ఓట్లు పోతాయని భావించిన కాంగ్రెస్​ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల హైడ్రాకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు తీస్తున్నారు. హైడ్రాను ఏర్పాటు చేసి ఏడాది దాటి పోయింది. అయితే ఆయా కాలనీల్లో ఆక్రమణలు కూల్చివేసినప్పుడు స్థానికులు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇటీవల నగరంలోని పలు కాలనీల్లో ప్రజలు హైడ్రాకు థాంక్స్​ చెబుతూ ర్యాలీలు తీస్తుండటం గమనార్హం. కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ర్యాలీలు చేపడుతున్నట్లు పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

Hydraa | వరద ముప్పును తప్పించిన హైడ్రా

వరద ముప్పును తప్పించిన హైడ్రాకు పలు కాలనీ నివాసితులు ధన్యవాదాలు తెలిపారు. అమీర్​పేట (Ameerpet), శ్రీనివాస్ నగర్, గాయత్రినగర్, కృష్ణ నగర్, అంబేద్కర్ నగర్ నుంచి వచ్చినా ఆ కాలనీల ప్రతినిధులు గురువారం మైత్రివనం వద్ద ప్లకార్డులను ప్రదర్శించి హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. హైడ్రా అధికారులు భూగర్భ పైపులైన్లలో (underground pipelines) పూడికను తొలగించడంతో తమ కాలనీల్లో నీరు నిలవడం లేదని హర్షం వ్యక్తం చేశారు. ప్యాట్నీ నాలాను విస్తరించి పైన ఉన్న ఏడెనిమిది కాలనీలకు వరద ముప్పు తప్పించిన హైడ్రాకు అక్కడి వాళ్ళు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం సైతం పలు కాలనీల్లో ర్యాలీలు చేపట్టారు. ఇన్ని రోజులు లేనిది, ఇప్పుడు ర్యాలీలు చేపడుతుండటంతో జూబ్లీహిల్స్​ ఎన్నికల కోసమేనని పలువురు భావిస్తున్నారు.