అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Actor Rajasekhar | సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సినిమాల్లో చురుకుగా నటించడం ప్రారంభించిన ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్ మరోసారి షూటింగ్‌లో గాయపడ్డారు. నవంబర్ 25న మేడ్చల్ (Medchal) పరిసరాల్లో జరుగుతున్న యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఆయన కాలికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
యాక్షన్ సీన్‌లో భాగంగా జరిగిన ప్రమాదంలో రాజశేఖర్ కుడి చీలమండకు బైమలియోలార్ డిస్‌లోకేషన్‌తో పాటు కాంపౌండ్ ఫ్రాక్చర్ (Compound Fracture) వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఇది ఎక్కువ నొప్పి కలిగించే, అత్యంత ప్రమాదకర గాయాలలో ఒకటని అంటున్నారు. ప్రాథమిక పరీక్షల అనంతరం వెంటనే శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తేల్చారు.
Actor Rajasekhar | డిసెంబర్ 8న కీలక శస్త్రచికిత్స పూర్తీ
వైద్యుల సూచనల మేరకు కుటుంబ సభ్యులు ఆపరేషన్‌కు అంగీకరించగా, డిసెంబర్ 8న మూడు గంటలకు పైగా సాగిన శస్త్రచికిత్స (Surgery) విజయవంతంగా ముగిసింది. చికిత్స అనంతరం రాజశేఖర్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆయన ప్రస్తుతం కోలుకునే దశలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. డాక్టర్లు రాజశేఖర్‌కి కనీసం 3–4 వారాలపాటు పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని సూచించారు. ముఖ్యంగా కొంతకాలం కాలికి ఏ విధమైన ఒత్తిడీ రానీయకూడదని, కాలు కదపకూడదని వైద్యులు హితవు పలికారు. దీంతో రాజశేఖర్ డిసెంబర్ నెలలో జరగాల్సిన షూటింగ్‌ల నుండి పూర్తిగా దూరంగా ఉంటారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితి చూస్తే, జనవరి నుంచి మెల్లిగా షూటింగ్‌ల్లో పాల్గొనే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల ఆశీస్సులు, వైద్యుల పర్యవేక్షణతో త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని కూడా విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే రాజశేఖర్ షూటింగ్‌లో గాయపడటం మొదటిసారి కాదు. 1989 నవంబర్ 15న ‘మగడు’ సినిమా షూటింగ్ సమయంలో ఎడమ కాలి చీలమండకూ ఇలాంటి గాయమే అయింది. ఇప్పుడు అదే నెలలో మరోసారి గాయపడటం ఆయనకు, అభిమానులకు బాధ కలిగిస్తోంది. రాజశేఖర్ నటించిన ‘బైకర్’ చిత్రం (Biker Movie) ఇప్పటికే పూర్తయ్యి విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంకా మరో రెండు ప్రాజెక్టుల షూటింగ్‌ల్లో పాల్గొంటున్న ఆయన ప్రస్తుతం కథానాయకుడిగానూ, ముఖ్యమైన పాత్రలలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే తాజా గాయంతో అన్ని షూటింగ్ షెడ్యూల్‌లను తిరిగి మార్చాల్సి వచ్చింది.