అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rajamundry Road Accident | రాజమండ్రి Rajamundry సమీపంలోని దివాన్‌చెరువు Divancheruvu వద్ద మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వరుసగా వెళ్తున్న నాలుగు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో 26 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనలో రెండు ట్రావెల్ బస్సులతో పాటు తెలంగాణకు చెందిన ప్రభుత్వ మోడల్ స్కూల్, కళాశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న మరో రెండు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం నల్గొండ Nalgonda జిల్లా దిండి ప్రాజెక్టు Dindi Project సమీపంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ మోడల్ స్కూల్, కళాశాలకు చెందిన 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు మూడు రోజుల క్రితం విహారయాత్రకు బయలుదేరారు.
Rajamundry Road Accident | గేదె అడ్డురావడంతో సడన్ బ్రేక్..
మొత్తం 40 మంది బాలికలు, 40 మంది బాలురు, 10 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది రెండు బస్సుల్లో అరకు, పాడేరు తదితర ప్రాంతాలను సందర్శించారు. పర్యటన పూర్తయ్యాక తిరిగి నల్గొండకు బయలుదేరే క్రమంలో ముందుగా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మంగళవారం Tuesday అర్ధరాత్రి దాటిన తర్వాత రాజమండ్రి వైపు ప్రయాణం కొనసాగించారు. దివాన్‌చెరువు పరిధిలో వరుసగా వెళ్తున్న నాలుగు బస్సుల్లో ముందున్న ట్రావెల్ బస్సు డ్రైవర్ ఓ గేదె అడ్డురావడంతో సడన్‌గా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న విద్యార్థుల బస్సులు రెండు, మరో ట్రావెల్ బస్సు ఒకదానినొకటి ఢీకొంటూ చైన్ యాక్సిడెంట్‌కు దారితీశాయి. ఈ ప్రమాదంలో ముఖ్యంగా విద్యార్థులు ప్రయాణిస్తున్న రెండు బస్సుల్లో ఉన్న 26 మందికి పైగా పిల్లలు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే హోంగార్డ్స్ డీఎస్పీ కిరణ్‌కుమార్ Kiran Kumar , సీఐలు మంగాదేవి, సుమంత్‌తో పాటు పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను మూడు అంబులెన్స్‌ల్లో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మిగిలిన విద్యార్థులను దివాన్‌చెరువులోని బాలవికాస్ మందిరానికి తరలించి భద్రంగా ఉంచారు. ప్రస్తుతం గాయపడిన విద్యార్థులకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరికి స్వల్ప గాయాలు కాగా, మరికొందరికి సాధారణ గాయాలున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.