అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Raj Bhavan | తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిషికేషన్ జారీ చేసింది. రాజభవన్ పేరును ‘లోక్‌భవన్’గా (Lok Bhavan) మార్చింది. గవర్నర్ల అధికారిక నివాసాలకు పేరు మార్చాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Telangana Raj Bhavan | ప్రధాన మంత్రి మంత్రి కార్యాలయం పేరు మార్పు
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం (NDA government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్ల అధికారిక నివాసగృహాల పేర్లను మార్చింది. ఇప్పటివరకు ‘రాజ్ భవన్’గా పిలుచుకునే ఈ భవనాలను ఇకపై ‘లోక్ భవన్’ అని పిలుస్తారు. ఈ మార్పుతో పాటు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) పేరును కూడా కేంద్ర గృహ నిర్మాణ శాఖ మార్చింది. ఇకపై ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ‘సేవాతీర్థ్’ అని అధికారికంగా పిలవనున్నారు.
కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ‘రాజ్ భవన్’, ‘పీఎంఓ’ వంటి పేర్లు బ్రిటిష్ వలస పాలన ఛాయలను ప్రతిబింబిస్తాయని పేర్కొంది. అందుకే స్వాతంత్య్రానంతర భారత్‌లో ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా కొత్త పేర్లను ఎంచుకున్నట్టు ప్రకటించింది. ‘లోక్ భవన్’ అంటే ప్రజల భవనం, ‘సేవాతీర్థ్’ అంటే సేవా క్షేత్రమనే అర్థాలు వస్తాయని అధికార వర్గాలు వివరించాయి.
ఈ ఉత్తర్వులు జారీ అయిన వెంటనే పలు రాష్ట్రాలు స్పందించాయి. పశ్చిమ బెంగాల్, త్రిపురా, అస్సాం, కేరళ వంటి రాష్ట్రాలు డిసెంబర్ 1 నుంచే కొత్త పేరుతో సైన్‌బోర్డులు, అధికారిక వెబ్‌సైట్లు, లేఖల పత్రికలను మార్చేశాయి. అయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ వంటి ప్రతిపక్ష పార్టీలు ఈ చర్యను “కేంద్రం రాష్ట్రాల హక్కుల దాడి”గా అభివర్ణించాయి. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. దేశవ్యాప్తంగా ఈ పేరు మార్పు అమలు ఎలా ఉంటుందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
