అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో నాలుగైదు రోజుల పాటు వానలు దంచికొట్టాయి. వానాకాలం సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పుడే భారీ వర్షాలు (Heavy Rains) పడ్డాయి. దీంతో వాగులు ఉధృతంగా పారుతున్నాయి. చెరువులు నిండుకుండల్లా మారాయి. ప్రాజెక్ట్‌లు జలకళను సంతరించుకున్నాయి. సోమవారం రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు.
రాష్ట్రంలో ఆదివారం వర్షాలు పడలేదు. సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చలిగాలులు వీస్తాయి. ఎండ వస్తుంది. అక్కడక్కడ సాయంత్రం పూట తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో సైతం వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు.
Weather Updates | మళ్లీ వర్షాలు అప్పుడే..
రాష్ట్రంలో మంగళవారం కూడా వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ(Meteorological Department) పేర్కొంది. బుధ, గురు వారాల్లో మాత్రం మోస్తరు వానలు పడొచ్చని వెల్లడించింది. ప్రస్తుతం కురిసిన వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు వెళ్లనీయకుండా ముసురు వాన కురిసింది. అంతేగాకుండా సాయంత్రం పూట భారీ వర్షాలు పడ్డాయి. దీంతో చాలా గ్రామాల్లో చెరువులు నిండుకుండల్లా మారాయి. పంటలకు జీవం వచ్చింది. వాగులు ఉప్పొంగి పారుతున్నాయి.
Weather Updates | ప్రాజెక్ట్‌లకు జలకళ
వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లకు జలకళ వచ్చింది. కృష్ణానదిపై గల జూరాల, శ్రీశైలం(Srisailam) ఇప్పటికే నిండగా.. తాజాగా నాగార్జున సాగర్(Nagarjuna Sagar)కు భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ కూడా నిండుకుండలా మారింది. దీంతో కొద్ది గంటల్లో జలాశయం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. మరోవైపు గోదావరిపై గల శ్రీరామ్‌సాగర్(Sriram Sagar)కు భారీగానే వరద వస్తోంది. మంజీరపై గల సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లకు మాత్రమే స్వల్ప ఇన్‌ఫ్లో నమోదు అవుతోంది.