అక్షరటుడే, ఆర్మూర్: Jeevan Reddy | కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి (Vinay Kumar Reddy) (పీవీఆర్) బెదిరింపులకు తాను భయపడనని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (Asannagari Jeevan Reddy) అన్నారు.
పీ అంటే పైసా.. వీ అంటే వసూల్.. ఆర్ అంటే రెడ్డి అని ఆయన ఎద్దేవా చేశారు. పీవీఆర్ క్రైం నంబర్.2 పేరుతో ఆయన బుధవారం మున్సిపల్ ఆఫీస్‌ను సందర్శించారు. అక్కడ వాయిస్ రికార్డ్ సీసీ కెమెరాల (CCTV cameras) ఏర్పాటును చూసి మండిపడ్డారు.
Jeevan Reddy | జనతా గ్యారేజ్‌లో పలువురి ఫిర్యాదు
ఆర్మూర్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను ఏర్పాటు చేసిన జనతా గ్యారేజ్ కార్యక్రమానికి (Janatha Garage program) పలువురు ఈ పీవీఆర్ అవినీతిపై ఫిర్యాదులు చేశారని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పీవీఆర్ కొత్త అవినీతికి తెరలేపారని ఆయన ఆరోపణలు గుప్పించారు. తనను ఉద్దేశించి వినయ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జీవన్‌రెడ్డి భగ్గుమన్నారు.
‘నా అంతు చూస్తా’ అని పీవీఆర్ అన్నారని.. తాను మున్సిపల్ కార్యాలయంలోనే ఉంటానని.. దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. సమాచార హక్కు చట్టం ప్రకారం తెప్పించిన అన్ని ఆధారాలతో తాను పీవీఆర్‌పై నిర్దిష్టమైన ఆరోపణలు చేశానన్నారు. వాటికి పీవీఆర్ సూటిగా జవాబు చెప్పకుండా నాపై వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.
Jeevan Reddy | మున్సిపాలిటీలో సీసీ కెమెరాలు పెట్టే అధికారం ఎవరిచ్చారు..?
మున్సిపాలిటీలో సీసీ కెమెరాలు పెట్టే అధికారం పీవీఆర్‌కు ఎవరిచ్చారని, ఏ అర్హత ఉందని ప్రభుత్వ కార్యకలాపాలలో జోక్యం చేసుకుంటున్నావని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజాప్రతినిధివి కాదు కదా కనీసం ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్ కూడా కాని వ్యక్తికి సీసీ కెమెరాలు పెట్టే అధికారం ఎక్కడిదన్నారు. పీవీఆర్ వసూళ్ల దందాపై ప్రజలు తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారులు పీవీఆర్ మాటలు విని జైళ్లపాలు కావద్దని హితవు పలికారు. కలెక్టర్ వెంటనే స్పందించి మున్సిపల్ ఆఫీస్‌లో (municipal office) సీసీ కెమెరాలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వినయ్ కుమార్ రెడ్డితో కుమ్మక్కై ప్రజాధనం దోపిడీ చేస్తున్న పలువురు అధికారుల పేర్లు తన జనతా గ్యారేజ్‌లోని పింక్‌బుక్‌లో ఎక్కిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం రాగానే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని జీవన్ రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ ఆర్మూర్ పట్టణ (Armoor Town) అధ్యక్షుడు పూజ నరేందర్, మాజీ కౌన్సిలర్ చక్రు, సీనియర్ నాయకులు పోల సుధాకర్, రాజేశ్వర్ రెడ్డి, సుంకరి రవి, శ్యాం, పృథ్వీ, మీర శ్రావణ్, మహేష్, అజీమ్, మాలిక్ బాబా, అర్షద్, లతీఫ్, సైఫ్ తదితరులు పాల్గొన్నారు.
