అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Badminton Academy | అమరావతిలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ మరో కీలక అడుగు వేశారు. అబ్బరాజు పాలెం (Abbaraju Palem)లో “పుల్లెల గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీ” నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గోపీచంద్ (Pullela Gopichand) కుటుంబ సభ్యులు, క్రీడాకారులు, అధికారులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అకాడమీ కోసం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) 12 ఎకరాల భూమిని ఫ్రీహోల్డ్ బేసిస్‌లో కేటాయించింది. ఎకరాకు రూ. 10 లక్షలు ధరగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఒప్పందం 2017లో టీడీపీ ప్రభుత్వం సమయంలో పూర్తైంది.
Badminton Academy | 12 ఎకరాలు CRDA నుంచి – 2017లోనే ఒప్పందం
ఫ్రీహోల్డ్ బేసిస్‌గా ఇచ్చినందున, గోపీచంద్‌కు ఆ భూమిపై పూర్తి హక్కులు ఉంటాయి. భవిష్యత్తులో అమ్ముకోవడం, ట్రాన్స్‌ఫర్ చేయడం, వారసులకు ఇవ్వడం వంటి నిర్ణయాలపై ఆయనకి స్వేచ్ఛ ఉంటుంది. అదే సమయంలో ఆ భూమికి సంబంధించిన నిర్వాహణ, నిర్మాణ ఖర్చులు, మెయింటెనెన్స్ బాధ్యతలు మొత్తం గోపీచంద్‌దే. భూమి పూజ (Bhoomi Pooja) అనంతరం గోపీచంద్ మాట్లాడుతూ ..అమరావతిలో స్థాపించనున్న ఈ అకాడమీలో ప్రపంచ స్థాయి ఇండోర్ కోర్టులు, అధునాతన శిక్షణ సదుపాయాలు, అథ్లెట్ల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయే మొత్తం మౌలిక వసతులు రూపొందించనున్నట్టు తెలిపారు. అకాడమీ పూర్తయిన తర్వాత దక్షిణ భారతదేశంలో ప్రముఖ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రంగా అమరావతి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
APCRDA అధికారులు మాట్లాడుతూ.. గోపీచంద్ అకాడమీ నిర్మాణం నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా అవసరమైన సహకారం అందిస్తామని, అమరావతి (Amaravati)ని క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.పద్మభూషణ పురస్కార గ్రహీత గోపీచంద్ చేతుల్లో ఈ అకాడమీ రూపుదిద్దుకోవడం ద్వారా, భవిష్యత్తులో అనేక మంది తెలుగు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి చేరే అవకాశం పెరుగుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
