Homeఅంతర్జాతీయంImran Khan | ఇమ్రాన్ ఖాన్ హత్య వదంతులతో పాక్‌లో ఉద్రిక్తత.. పాక్ లో 144...

Imran Khan | ఇమ్రాన్ ఖాన్ హత్య వదంతులతో పాక్‌లో ఉద్రిక్తత.. పాక్ లో 144 సెక్షన్ విధింపు

ఇమ్రాన్ ఖాన్ మరణించారని ప్రస్తావించినట్లు ఆరోపణలు రావడంతో గందరగోళం ఏర్పడింది. అఫ్ఘాన్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం పూర్తిగా తప్పుడు ప్రచారం గా కొట్టిపారేసింది.ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో 144 సెక్ష‌న్ కూడా విధించారు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారన్న వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. రావల్పిండి అదియాలా జైల్లో ఆయనను చిత్రహింసలకు గురిచేసి చంపివేశారన్న ఆరోపణలు అఫ్ఘాన్ టైమ్స్‌ (Afghan Times)లో వెలువడడంతో రాజకీయం మరింత వేడెక్కింది.

బలూచిస్తాన్ విదేశాంగ శాఖ కూడా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Pakistan Army Chief Asim Munir), నిఘా సంస్థ ఐఎస్ఐలు కలిసి కుట్రపూర్వకంగా హత్య చేశారంటూ ఆరోపణలు చేసింది. అయితే అదియాలా జైలు అధికారులు ఈ వాదనలను పూర్తిగా ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నారు. వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని స్పష్టం చేశారు. ఇమ్రాన్ కుటుంబ సభ్యులకు అనుమతి లేకపోవడం అనుమానాలకు దారితీస్తోంది.

Imran Khan | ప‌రిస్థితి చేయి దాటిందా?

ఇమ్రాన్ ఖాన్‌ను గత కొన్ని నెలలుగా ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, మిత్రులు ఎవరూ చూడలేదు.ఈ కారణంగా ఆయన ఆరోగ్యం, భద్రతపై పలు అనుమానాలు మరింత బలపడుతున్నాయి . ఇటీవల ఆయన సోదరీమణులు నోరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ జైలుకు వెళ్లి కలుసుకునేందుకు ప్రయత్నించగా, అధికారులు అనుమతించలేదు. తమపై పోలీసులు అతి దారుణంగా వ్యవహరించారని,“జుట్టుపట్టుకుని ఈడ్చేశారు” అని ఇమ్రాన్ సోదరీమణుల ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వకపోవడంతో పీటీఐ కార్యకర్తలు ఆగ్రహంలో ఉన్నారు.

ఈరోజు ఇస్లామాబాద్, రావల్పిండిలో భారీ నిరసనలు చేప‌ట్టారు. అదియాలా జైలు వెలుపల, ఇస్లామాబాద్ హైకోర్టు (High Court) వద్ద మద్దతుదారుల ర్యాలీలు చేస్తున్నారు. ప్రజా భద్రత దృష్ట్యా బహిరంగ సభలు, ర్యాలీలపై బుధవారం వరకు నిషేధం విధించారు. రావల్పిండిలో సమావేశాలు, సిట్-ఇన్‌లు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహించకుండా పోలీసులు సెక్షన్ 144 విధించారు. 2022లో అవిశ్వాస తీర్మానం తర్వాత పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్, ఆ తర్వాత అవినీతి, ఉగ్రవాదం, గోప్యత ఉల్లంఘన ఇలా పలు కేసుల్లో నిందితుడిగా మారారు. 2023 ఆగస్టు నుండి ఆయన అదియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కానీ గత కొంత కాలంగా ఆయనను ఎవరూ చూడకపోవడం , సమాచారాన్ని గోప్యంగా ఉంచడం పాక్ రాజకీయాలను అస్తవ్యస్తం చేస్తోంది.

Must Read
Related News