అక్షరటుడే, కామారెడ్డి: RTI | అధికారుల్లో జవాబుదారీతనం, పారదర్శకత ఉంటేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని రాష్ట్ర సమాచార శాఖ చీఫ్ కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సమాచార కమిషనర్లతో కలిసి కలెక్టరేట్లో (Kamareddy Collectorate) మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కామారెడ్డి (Kamareddy) నుంచి ఆర్టీఐ కింద తక్కువ దరఖాస్తులు వచ్చాయని, అందుకే ఈ జిల్లాను ఎంచుకోవడం జరిగిందన్నారు. కార్యాలయాల్లో ఉన్న సమాచారాన్ని ప్రజలకు ఖచ్చితంగా చేరవేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఐ కింద 2 లక్షల దరఖాస్తులు వస్తాయని, కేవలం కమిషనర్ స్థాయిలోనే 15వేల దరఖాస్తులు వస్తాయని వివరించారు. కొత్త జిల్లాల్లో రెస్పాన్స్ తక్కువగా ఉందని తెలిపారు. ఈ చట్టంలో మొత్తం 31 సెక్షన్లు ఉంటాయని వివరించారు. దరఖాస్తుదారుడు సమాచారం ఎందుకు అడుగుతున్నాడో దరఖాస్తులో పొందుపర్చాల్సిన అవసరం లేదని తెలిపారు. దరఖాస్తు చేసిన 45 రోజుల్లో సమాచారం ఇవ్వాలని, లేకపోతే సమాచారం ఇవ్వడం ఇష్టం లేదని అర్థమన్నారు.
దీనిపై ఫస్ట్ అప్పీల్‌కు వెళ్లే హక్కు దరఖాస్తుదారునికి ఉందన్నారు. ఫస్ట్ అప్పీల్ తర్వాత 30 రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే రెండవసారి అప్పీల్‌కు వెళ్తారని దీనికి టైం లిమిట్ లేదన్నారు. ప్రతి ఒక్క అధికారి టైం లిమిట్‌లోనే సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అప్పటికీ సమాచారం ఇవ్వకపోతే ప్రతిరోజూ రూ.250 నుంచి రూ.25వేల వరకు అధికారికి ఫెనాల్టీ విధిస్తామన్నారు.
RTI | ప్రజల అవసరాల కోసమే చట్టం..
రాష్ట్ర సమాచార కమిషనర్ అయోధ్య రెడ్డి(Ayodhya Reddy) మాట్లాడుతూ ప్రజల అవసరాల కోసమే సమాచార హక్కు చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పీఐవోలపై ఉందని అన్నారు. ప్రజలకు సమాచారం అవసమైనా, కాకపోయినా అధికారుల వద్ద సమాచారం తప్పక ఉండాలన్నారు.
ఒక ప్రభుత్వ శాఖ ఏర్పాటు అవసరం ఏమిటి.. దానివల్ల ఉపయోగం ఏమిటి అనేది ప్రజలు అడగకున్నా చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని తెలిపారు. 4 (1)బీకి సంబంధించి రిజిస్టర్-1, రిజిస్టర్-2 మెయింటెన్ చేయాలని, రిజిస్టర్-1లో వచ్చిన దరఖాస్తు తేదీ, దాని వివరాలు, నమోదు చేయాలన్నారు.
రిజిస్టర్-2లో వచ్చిన దరఖాస్తును పరిష్కరించబడిన వివరాలు నమోదు చేయాలన్నారు. అనంతరం అధికారుల అనుమానాలను నివృత్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర కమిషనర్లు మెహసీన్ పర్వీన్, దేశాల భూపాల్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
