అక్షరటుడే, బోధన్: MLA Sudarshan Reddy | అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. బోధన్ పట్టణంలోని లయన్స్ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాలకు వస్తువులను అందజేశారు.
బోధన్ డివిజన్లోని (Bodhan division) 113 అంగన్వాడీ కేంద్రాలకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చొరవతో దీక్షిత్ గ్యాస్ ఏజెన్సీ ఉచితంగా గ్యాస్ పొయ్యియి సమకూర్చింది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో బియ్యం, ఇతర సరుకులు భద్రపరచుకునేందుకు అనువుగా ఉండే ప్లాస్టిక్ కంటైనర్లు స్థానిక నాయకుడు శరత్ అందించారు. వీటిని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy), కలెక్టర్ ఇలా త్రిపాఠి నిర్వాహకులకు పంపిణీ చేశారు.
MLA Sudarshan Reddy | మహిళల అభ్యున్నతికి కృషి
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, డివిజన్లోని మిగతా అంగన్వాడీ సెంటర్లకు కూడా వీటిని సమకూరుస్తామని హామీ ఇచ్చారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
MLA Sudarshan Reddy | మినీ అంగన్వాడీల అప్గ్రేడేషన్..
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. ఇందులో భాగంగానే మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసిందన్నారు. ఎక్కడ కూడా మహిళల కోసం ఇంత పెద్దఎత్తున కార్యక్రమాలు అమలు కావడం లేదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ ఉద్యోగులు తమ హక్కులు, బాధ్యతలను గుర్తెరిగి చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యాల పరిరక్షణకు పాటుపడాలని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, బోధన్ తహశీల్దార్ విఠల్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నగేష్ రెడ్డి, బోధన్ సీడీపీవో పద్మ తదితరులు పాల్గొన్నారు.