అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | క్రిమి సంహారక మందులు లేని లాభసాటి వ్యవసాయమే భారతీయ కిసాన్ సంఘ్ (Bharatiya Kisan Sangh) ఉద్దేశమని జాతీయ గో ఆధారిత వ్యవసాయ ప్రముఖ్ నానా అక్రేయ అన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన భారతీయ కిసాన్ సంఘ్ సమావేశంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో క్రిమిసంహారిక మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం (organic farming) చేసేందుకు భారతీయ కిసాన్ సంఘ్ రైతులకు తోడ్పాటు అందిస్తుందన్నారు.
Kamareddy | రైతులను సంఘటితం చేస్తూ..
రైతులను సంఘటితం చేస్తూ, రైతుల సమస్యల పట్ల భారతీయ కిసాన్ సంఘ్ పోరాటాలు చేస్తుందని అక్రేయ తెలిపారు. అధిక పెట్టుబడులతో రైతాంగం నష్టపోతున్నారని, తక్కువ పెట్టుబడితో గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను నడిపించేందుకు భారతీయ కిసాన్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతులు పండించిన పంటలకు ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మనమందరం విషతుల్యమైన ఆహారం తింటున్నామని, క్రిమి సంహారక మందులతో పండించిన ఆహారం తినడం వలన అనేక రకాల జబ్బులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం లాభసాటి వ్యవసాయం లేక రైతులు (farmers) ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి నెలకొందన్నారు. రైతులకు వెన్నంటే భారతీయ కిసాన్ ఉంటుందని తెలిపారు. గత వర్షాకాలంలో అధిక వర్షాలకు రైతులు అతలాకుతలం అయ్యారని, పండించిన పంటలు పాడై నష్టపోయారని, వారిని ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా భారతి కిసాన్ సంఘ్ అధ్యక్షుడు పైడి విఠల్ రెడ్డి , కార్యదర్శి శంకర్ రావు, ఆయా మండలాల సంఘ్ ప్రతినిధులు పాల్గొన్నారు.