అక్షరటుడే, వెబ్‌డెస్క్: Prithvi Shaw | భారత స్టార్ క్రికెటర్ పృథ్వీ షా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ముంబయిలోని దిండోషి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు (Metropolitan Magistrate Court) జారీ చేసిన నోటీసులకు స్పందించకపోవడంతో కోర్టు అతనిపై రూ.100 జరిమానా విధించింది.
ఇది ఆర్థికపరంగా చిన్న మొత్తమైనా, న్యాయస్థాన ఆదేశాలను పట్టించుకోకపోవడంపై హెచ్చరికగా భావించబడుతోంది. ఈ వివాదం 2023 ఫిబ్రవరిలో ముంబయి అంధేరి (Mumbai Andheri) ప్రాంతంలోని ఒక పబ్ బయట మొదలైంది. సెల్ఫీ తీసుకునే విషయంలో పృథ్వీ షా, సప్నా గిల్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన తర్వాత షా తనను వేధించాడని ఆరోపిస్తూ సప్నా గిల్ (Influencer Sapna Gill) పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మొదటిసారిగా గిల్‌నే పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.
Prithvi Shaw | చిక్కుల్లో పృథ్వీ షా..
పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో, సప్నా గిల్ నేరుగా కోర్టును ఆశ్రయించింది. ఆమె తన పిటిషన్‌లో పృథ్వీ షా, అతని స్నేహితుడు ఆశిష్ యాదవ్‌లపై ఐపీసీ సెక్షన్లు 354 (వేధింపులు), 509 (మహిళల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు/సంజ్ఞలు), 324 (ప్రమాదకర ఆయుధాలతో గాయపరిచే చర్యలు) కింద కేసు నమోదు చేయాలని కోరింది. షా తనపై బ్యాట్‌తో దాడి చేశాడని ఆమె ఆరోపించింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం మరింత దృష్టిని ఆకర్షించింది.
పిటిషన్ విచారణ సందర్భంగా పృథ్వీ షా(Prithvi Shaw)కు కోర్టు పలు మార్లు నోటీసులు జారీ చేసినా, ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో న్యాయస్థానం ఈ జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోతే, అది నేరపూరితంగా పరిగణించబడే అవకాశం ఉంటుందన్నది స్పష్టం చేస్తుంది. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. పృథ్వీ షా నుంచి ప్రతిస్పందన వచ్చే అవకాశం ఉందా అనేదే ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది.