అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Svanidhi Credit Card | కూరగాయలు, పండ్లు, పాన్ షాపులు వంటి చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు అప్పు కోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) కొత్త స్కీమ్ తీసుకువచ్చారు.
వారికి ఆర్థిక భరోసా కల్పించడం కోసం స్వనిధి పేరుతో క్రెడిట్‌కార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అత్యవసర సమయంలో అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగకుండా ఈ కార్డు ఉపయోగపడనుంది. చిరు వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడే ఈ క్రెడిట్ కార్డు విశేషాలు తెలుసుకుందామా.
PM Svanidhi Credit Card | ఎవరికి ఇస్తారంటే..
దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త స్కీం ప్రవేశపెట్టారు. పీఎం స్వనిధి పేరుతో క్రెడిట్ కార్డ్ తీసుకువచ్చారు. ఇది యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డ్ (RuPay Credit Card). వీధి వ్యాపారులు తమ రోజువారీ వ్యాపార అవసరాలకు లేదా వ్యక్తిగత అత్యవసరాలకు ఈ కార్డు ద్వారా డబ్బును వాడుకోవచ్చు. ఈ రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా వ్యాపార అవసరాల కోసం డబ్బులను సెకస్ల వ్యవధిలోనే పొందడానికి అవకాశం ఉంటుంది.
పీఎం స్వనిధి స్కీమ్ కింద రెండో విడత లోన్‌ను సకాలంలో చెల్లించిన వీధి వ్యాపారులకు ఈ క్రెడిట్ కార్డు అందిస్తారు. ఏడాదికి గరిష్టంగా రూ.12 వందల వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇవ్వనున్నారు.
PM Svanidhi Credit Card | ఎంత లిమిట్ లభిస్తుందంటే?
పీఎం స్వనిధి స్కీమ్ (PM Svanidhi Scheme)కింద లబ్ధిదారు తీసుకున్న లోన్ విడతపై క్రెడిట్ లిమిట్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం పీఎం స్వనిధి స్కీమ్‌లో మూడు విడతల్లో రుణాలు ఇస్తున్నారు. మొదటి విడతలో రూ. 15 వేలు, రెండో విడతలో రూ. 25 వేలు, మూడో విడతలో రూ. 50 వేల వరకు రుణం అందుతోంది. రెండో విడత రుణాన్ని తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించినవారికి స్వనిధి క్రెడిట్ కార్డ్ అందించనున్నారు. అంటే రూ. 25 వేలనుంచి రూ. 50 వేల వరకు క్రెడిట్ లిమిట్ లభించే అవకాశాలు ఉన్నాయి. తీసుకున్న క్రెడిట్‌ను బిల్లింగ్ గడువులోగా చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు.
PM Svanidhi Credit Card | ఎవరిని సంప్రదించాలంటే?
పీఎం స్వనిధి స్కీమ్ లబ్ధిదారులు ఈ క్రెడిట్ కార్డ్ కోసం తమకు లోన్ అందించిన బ్యాంకు శాఖ (Bank Branch)ను సంప్రదించాలి. రెండో విడత రుణాన్ని సక్రమంగా చెల్లించిన వారే అర్హులు. బ్యాంకులు కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి అర్హులైన వారికి రూపే క్రెడిట్ కార్డును జారీ చేస్తాయి.
మున్సిపల్ కార్యాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా కూడా ఈ ప్రక్రియకు సంబంధించిన సహాయం పొందవచ్చు.