అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం (Srisailam Mallikarjuna Swamy Temple)లో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు, ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
స్వామివారికి ప్రధాని రుద్రాభిషేకం, భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. ఆయన వెంట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఉన్నారు.శ్రీశైలం ఆలయ సందర్శనపై మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.“శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రార్థించుకున్నాను. నా తోటి భారతీయుల సౌభాగ్యం కోసం,వారి ఆరోగ్యం కోసం ప్రార్థించాను. అందరూ సుఖ సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ప్రధాని పోస్ట్ చేశారు.
PM Modi | శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శన
శ్రీశైలంలోని శివాజీ ధ్యాన మందిరం, శివాజీ దర్బార్ హాల్‌ను ప్రధాని సందర్శించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1677 లో శ్రీశైలం వచ్చారని ప్రధాని పేర్కొన్నారు. శ్రీశైలం పర్యటన అనంతరం ప్రధాని కర్నూల్ చేరుకున్నారు. నన్నూరు దగ్గర 400 ఎకరాల్లో ప్రధాని మోదీ (PM Modi)బహిరంగ సభ నిర్వహించనున్నారు. 3 లక్షల మందితో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో బహిరంగ సభను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రధాని రూ.13,430 కోట్లతో 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
PM Modi | కట్టుదిట్టమైన భద్రత
మోదీ సభ ప్రాంగణం 50 ఎకరాల్లో ఉంటుంది. 360 ఎకరాల్లో 12 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. దాదాపు 7 వేల బస్సుల్లో జనాన్ని సమీకరించారు. 7,500మందికి పైగా పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సభా వేదిక మీదకు చేరుకున్నారు.