HomeజాతీయంPM Modi | కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మరోసారి నిప్పులు.. ప్రతీకార చర్యలు తీసుకోకుండా ఎవరు...

PM Modi | కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మరోసారి నిప్పులు.. ప్రతీకార చర్యలు తీసుకోకుండా ఎవరు ఆపారో చెప్పాలని డిమాండ్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్​ను విమర్శించారు. ముంబై పేలుళ్ల తర్వాత అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం పాకిస్థాన్​పై ఎందుకు చర్యలు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మరోసారి నిప్పులు చెరిగారు. ముంబై పేలుళ్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆ పార్టీ ఉగ్రవాదానికి మోకరిల్లిందని ధ్వజమెత్తారు.

ముంబై పేలుళ్ల తర్వాత పాకిస్తాన్(Pakistan)పై అప్పటి ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. దేశ హృదయంగా భావించే ముంబైపై దాడి చేసిన వారిపై కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఎందుకు విఫలమయ్యారని నిలదీశారు. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (Navi Mumbai International Airport) బుధవారం ప్రారంభించిన మోదీ అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత ఇండియా ప్రతీకార చర్యలు తీసుకోకుండా ఎవరు ఆపారో కాంగ్రెస్ పార్టీ వెల్లడించాలని ప్రధానమంత్రి డిమాండ్ చేశారు.

దాడికి ప్రతిస్పందనగా భారతదేశం సైనిక చర్య తీసుకోకుండా ఒక విదేశీ దేశం నిరోధించిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు మాజీ హోంమంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ఈ కీలక నిర్ణయాన్ని ఎవరు ప్రభావితం చేశారో తెలుసుకోవాల్సిన అవసరం దేశానికి ఉందని మోడీ నొక్కి చెప్పారు.

PM Modi | భారత హృదయంపై దాడి..

భారతదేశ ఆర్థిక శక్తి కేంద్రంగా, అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటిగా పిలుచుకునే ముంబైపై దాడి చేయడానికి ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగానే ఎంచుకున్నారని మోదీ తెలిపారు. 2008 నవంబర్లో విధ్వంసకర దాడికి పాల్పడ్డారన్నారు. దేశ హృదయంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న మూకలకు ముంబై ప్రధాన లక్ష్యంగా మారిందని తెలిపారు. ముంబై దాడుల సమయంలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ (Congress party) ఎందుకు కఠిన నిర్ణయాలు తీసుకోలేదని ప్రధాని ప్రశ్నించారు.

భయంకరమైన 26/11 దాడి తర్వాత నిర్ణయాత్మక చర్యలు తీసుకోక పోవడం ద్వారా ఉగ్రవాదం ఎదుట కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) మోకరిల్లిందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదుల పీచమణచాల్సింది పోయి బలహీనంగా వ్యవహరించారన్నారు. జాతీయ భద్రతను కాపాడటానికి, పౌరులను రక్షించడానికి అవసరమైన సంకల్పాన్ని ప్రతిబింబించడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

PM Modi | భద్రతను పణంగా పెట్టారు..

26/11 ముంబై పేలుళ్ల (Mumbai blasts) తర్వాత సైన్యం పాకిస్తాన్ పై ప్రతీకార దాడులు చేయడానికి సిద్ధమైనప్పటికీ, మరో దేశ ఒత్తిడి కారణంగా వెనక్కు తగ్గినట్లు కాంగ్రెస్ నేత పి.చిదంబరం ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ (PM Modi).. అప్పట్లో జాతీయ భద్రతా నిర్ణయాలను విదేశీ శక్తులు ఎలా ప్రభావితం చేశాయనే దానిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు విదేశీ ఒత్తిడికి తలొగ్గి ప్రతీకార దాడులకు వెనక్కు తగ్గారో ఆ విషయాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం రాజకీయ సమస్య కాదని, దేశ గౌరవం. భద్రతను ప్రభావితం చేసే విషయం అని, ప్రజలకు సత్యాన్ని తెలుసుకునే హక్కు ఉందని పేర్కొన్నారు.

PM Modi | కాంగ్రెస్ బలహీనత వల్లే ప్రాణ నష్టం..

అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ బలహీనత వల్లే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ప్రధాని మోదీ తెలిపారు. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించక పోవడంతో ఉగ్రవాదులు రెచ్చిపోయారని, పదే పదే దాడులకు దిగి అమాయక ప్రాణాలను బలిగొన్నారన్నారు. కాంగ్రెస్ బలహీనతను గ్రహించిన ఉగ్రవాదుల్లో ధైర్యం పెరిగి పోయిందని, ఫలితంగా అమాయక ప్రాణాలను పదే పదే త్యాగం చేయడానికి దారితీసిందన్నారు.

తమ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలా కాదని, దేశం, దాని ప్రజల భద్రత కంటే తమకేదీ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని (terrorism) సమూలంగా తుద ముట్టించేందుకు దృఢమైన విధానాన్ని అవలంభిస్తున్నామని చెప్పారు. “మాకు దేశం, పౌరుల భద్రత కంటే మరేమీ ముఖ్యం కాదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలనే దేశం సంకల్పానికి ఆపరేషన్ ఓ ఉదాహరణ’’ అని ఆయన ప్రస్తావించారు.