అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | బాల్యవివాహాలను నిరోధించడం మతపెద్దల బాధ్యత అని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గంగాస్థాన్ ఫేస్-2లో (Gangasthan Phase-2) ఉన్న రామకృష్ణ మఠంలో (Ramakrishna Matham) శనివారం బాల్య వివాహాల విముక్తి గురించి మతపెద్దలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడారు. బాల్యవివాహాల (Child Marriages) విషయంలో పిల్లల ఆధార్ కార్డు, పాన్ కార్డులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బాల్యవివాహాల చట్టం–2006 ప్రకారం శిక్షలు ఉంటాయని వివరించారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిని మత పెద్దలు గుర్తించాలని బాల్య వివాహాలకు సంబంధించి మత పెద్దల ద్వారా సమాజంలో మార్పు రావాలని తెలిపారు. వయస్సు నిర్ధారణ కచ్చితంగా పాటించాలని సూచించారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు ఎవరికైనా సమాచారం వస్తే వారు తమ దగ్గరలోని పోలీస్ వారికి లేదా జిల్లా, శిశు వయోవృద్ధుల శాఖ లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1098కు తెలియజేయాలన్నారు.
అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బాల్య వివాహాల వలన జరిగే నష్టాల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఉమెన్ కమిషనర్ మెంబర్ సూదం లక్ష్మి, జిల్లా సంక్షేమాధికారిణి ఎస్.కే.రసూల్ బీ, మైనార్టీ వెల్ఫేర్ జిల్లా అధికారిణి కృష్ణవేణి, డీసీపీవో చైతన్య, శిక్షకులు సునీత, స్వప్న, ఆదిత్య, మత పెద్దలు పాల్గొన్నారు.
