అక్షరటుడే ఇందూరు: Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వర్తించేలా అన్ని విధాలా సన్నద్ధం కావాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. కలెక్టరేట్లో ఎంపీడీవో, ఎంపీవోలతో మంగళవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిబంధనలపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలని.. ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావు లేకుండా ఎన్నికలను జాగ్రత్తగా నిర్వర్తించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ సాఫీగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలన్నారు.
Local Body Elections | గోడలపై రాతలు తొలగించాలి..
రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగులు, పోస్టర్లను, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల గోడలపై రాతలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను నిరోధించాలని, మద్యం, డబ్బు పంపకాలు, ఇతర ప్రలోభాలకు గురిచేసే వస్తువుల పంపిణీపై నిఘా ఉంచాలన్నారు.
ఓటరు జాబితాను (Voter List) నిశితంగా పరిశీలించాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లు గమనిస్తే తమ దృష్టికి తేవాలన్నారు. బ్యాలెట్ బాక్సులు (Ballot boxes), ఎన్నికల సామాగ్రిని జాగ్రత్తగా సరిచూసుకోవాలని సూచించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కోసం రెవెన్యూ డివిజన్ కేంద్రాల వారిగా కౌంటింగ్ గుర్తించాలని చెప్పారు.
సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిజ్ఞాన్ మాల్వియా, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, జడ్పీ సీఈవో సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, డీపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.