అక్షరటుడే, వెబ్డెస్క్ : Kalvakuntla Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడతానని గతంలో ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) తన పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ఈ మేరకు ఆమె కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత తనకంటూ ప్రత్యేక రాజకీయ అస్తిత్వం ఉండాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నిత్యం ప్రజల్లో ఉండేలా జాగృతి జానంబాట (Jagruthi Janambata) కార్యక్రమం నిర్వహించారు. పలు జిల్లాల్లో పర్యటించి కాంగ్రెస్, బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. జాగృతి బలోపేతంపై దృష్టి పెట్టారు. పార్టీ ఏర్పాటు కోసం ఆమె జాగృతిలో 50 కమిటీలు ఏర్పాటు చేశారు. అయితే కొత్త పార్టీ కోసం కవిత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor)తో చర్చించినట్లు సమాచారం.
Kalvakuntla Kavitha | పీకేతో సమావేశం
కవితతో కలిసి పని చేసేందుకు ప్రశాంత్ కిషోర్ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. రెండు నెలల వ్యవధిలో హైదరాబాద్ (Hyderabad)కు వచ్చి ఆయన కవితను రెండు సార్లు కలిశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు రోజుల పాటు పీకేతో కవిత సమావేశం అయినట్లు తెలిసింది. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు, జెండా, విధానాలు, జనాల్లోకి ఎలా వెళ్లడం అనే అంశాలపై ఆమె చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రజల కోసం ఒక పార్టీని ఏర్పాటు చేయడం, ప్రజలు ఆ పార్టీని ఎలా స్వీకరిస్తారనే కోణంలో చర్చలు జరిగినట్లు తెలిసింది.
Kalvakuntla Kavitha | వ్యూహాలు పని చేస్తాయా..
ప్రశాంత్ కిశోర్ కొంతకాలంగా ఇతర పార్టీలకు పని చేయడం లేదు. ఆయన బీహార్ (Bihar)లో సొంతంగా జనసురాజ్ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే 238 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేయగా.. ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. మొత్తం 3.44శాతం ఓట్లను సాధించింది. ఆ పార్టీ అభ్యర్థుల్లో 236 మంది డిపాజిట్లు కోల్పోయారు. 68 నియోజకవర్గాల్లో జన సురాజ్ పార్టీ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. బీహార్ ఎన్నికల (Bihar Elections) నేపథ్యంలో ఆయన కొంతకాలంగా అక్కడ రాజకీయాలకు పరిమితం అయ్యారు. అక్కడ ప్రజలు తిరస్కరించడంతో మళ్లీ వ్యూహకర్తగా పని చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. కాగా గతంలో ప్రశాంత్ కిశోర్ పలు బీజేపీ, వైసీపీ, టీఎంసీ వంటి పార్టీలకు పని చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలుమార్లు కేసీఆర్ (KCR)తో సైతం సమావేశం అయ్యారు. అయితే సొంతరాష్ట్రంలో ఒక్క సీటు గెలుచుకోలేకపోయిన పీకే వ్యూహాలు ప్రస్తుత తెలంగాణలో పని చేస్తాయా లేదా చూడాలి.