అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా భవన్ (Praja Bhavan)ను జల్సాలకు, విందులకు, వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క రోజు మాత్రమే ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. నాలుగైదు రోజులు మంత్రులు వచ్చారని ఆ తర్వాత వీళ్ళు కూడా పత్తా లేకుండా పోయారని విమర్శించారు. ప్రజా దర్బార్‌లో వచ్చిన దరఖాస్తులను పట్టించుకున్న నాథుడు లేడన్నారు. మేనిఫెస్టోలోని మొదటి కార్యక్రమం, రేవంత్ రెడ్డి మొదటి మాటే తుస్సుమందని విమర్శించారు. ప్రజా భవన్‌ను జల్సాలకు, విందులకు, వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని పేర్కొన్నారు. పొద్దుగాల బ్రేక్‌ఫాస్ట్ మీటింగులు, మధ్యాహ్నం సెటిల్‌మెంట్లు, సాయంత్రం గానా భజానాలు, సంగీత్‌లు, ఎంగేజ్‌మెంట్లు, విందులు వినోదాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
Harish Rao | సమస్య అలాగే ఉంది
కరీంనగర్ జిల్లా (Karimnagar District)కు చెందిన గొడుగు నాగరాజు అనే రైతు తనకు సమస్య ఉందని ప్రజా భవన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడని హరీశ్‌రావు చెప్పారు. అతని ఫోన్‌కు సమస్య పరిష్కారం అయిందని మెసేజ్ వచ్చిందన్నారు. కానీ ఇప్పటికీ ఆ సమస్య అలాగే ఉందని చెప్పారు.కేసీఆర్ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చి దిద్దితే, రేవంత్ రెడ్డి తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రతి ఊరికి పల్లె దవాఖానాలు, పెద్ద పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు కడితే, రేవంత్ రెడ్డి ప్రతి ఊరికి ఒక బారు, పబ్ పెట్టుకోమని చెప్తున్నాడన్నారు. ఐటీఐ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీకి తేడా కూడా తెలియని వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారన్నారు.
Harish Rao | పెండింగ్‌లో కల్యాణ లక్ష్మి చెక్కులు
తాము అధికారంలోకి వస్తే కల్యాణ లక్ష్మి పథకం (Kalyana Lakshmi Scheme)లో భాగంగా రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని గతంలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని మాజీ మంత్రి గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం రూ.లక్షకే దిక్కు లేకుండా పోయిందన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులు తీసుకునేందుకు మహిళలు వారి పిల్లలతో వస్తున్నారని ఎద్దేవా చేశారు. పెళ్లియిన ఏడాది తర్వాత కూడా చెక్కులు రావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కల్యాణలక్ష్మి పథకానికి ఇవ్వాల్సిన రూ.980 కోట్ల నిధులు పెండింగ్‌లో పెట్టిందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి జర్నలిస్ట్‌లకు ఏం చేయలేదన్నారు. రెండేళ్లలో ఒక్క అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమాలకు ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా అని ప్రశ్నించారు.