అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Cabinet | రాష్ట్ర కేబినెట్‌లో ఆధిపత్య పోరు కొనసాగుతోందా..? మంత్రుల్లో ఒకరంటే మరొకరికి పొసగడం లేదా? అంటే ఇటీవలి పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది.
ఇటీవలి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ వివాదం మరువక ముందే తాజాగా కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మధ్య విభేదాలు బయట పడ్డాయి. మంత్రి మండలిలో తీవ్ర స్థాయిలో నెలకొన్న విభేదాలు, అమాత్యుల మధ్య తలెత్తుతున్న వివాదాలు ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి ఇబ్బందికరంగా మారాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రుల మధ్య విభేదాలు రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. పొన్నం, అడ్లూరి ఎపిసోడ్ మరువక ముందే కొండా, పొంగులేటి ఆధిపత్య పోరు బయటపడడం కాంగ్రెస్‌లో కలకలం రేపింది.
Telangana Cabinet | మొన్న పొన్నం వర్సెస్ అడ్లూరి..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills by-Election)కు సంబంధించిన కార్యక్రమం సందర్భంగా మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం రాజేసింది. సమావేశానికి అడ్లూరి లక్ష్మణ్ కాస్త ఆలస్యంగా చేరుకోవడం, ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మైక్‌లో రికార్డ్ కావడం, ఆ వీడియో బయటకు రావడంతో కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపింది. మంత్రి అడ్లూరిని ఉద్దేశించి పొన్నం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. తాను మాదిగ ఉపవర్గానికి చెందిన వాడిననే కారణంతో సహచర మంత్రులు అవమానకరంగా ప్రవర్తించారని మంత్రి అడ్లూరి తీవ్ర వాపోయారు. ఈ నేపథ్యంలో దళిత సామాజిక వర్గానికి చెందిన అడ్లూరిని కించపరిచారని పేర్కొంటూ దళిత వర్గాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. పరిస్థితి చేయి దాటుతుండడంతో పీసీసీ రంగంలోకి దిగింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మంత్రులిద్దరిని బ్రేక్ ఫాస్ట్‌కు పిలిచి మంథనాలు జరిపారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పి వివాదం ముగిసిపోయింది.
Telangana Cabinet | పొంగులేటి, కొండా మధ్య విభేదాలు
పొన్నం, అడ్లూరి వివాదం ఎపిసోడ్ మరిచిపోక ముందే మంత్రుల మధ్య విభేదాలు మరోసారి బయటకు వచ్చాయి. కొండా సురేఖ(Konda Surekha), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy) మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్‌లో మరోసారి దుమారం రేపింది. రెవెన్యూ శాఖ మంత్రి దేవాదాయ శాఖలో జోక్యం చేసుకుంటున్నారని కొండా సురేఖ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, వరంగల్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి వరంగల్ జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేయడంతో పాటు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. మేడారం టెండర్ల వ్యవహారంలో జోక్యం చేసుకున్న పొంగులేటి తన సొంత కంపెనీకి కాంట్రాక్టులు ఇప్పించుకున్నారని తెలిపారు. కొండా దంపతుల ఆరోపణలతో మంత్రలు మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది.