HomeతెలంగాణCP Sajjanar | సోషల్​ మీడియాలో వాటినే పోస్ట్​ చేయండి.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక...

CP Sajjanar | సోషల్​ మీడియాలో వాటినే పోస్ట్​ చేయండి.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CP Sajjanar | సోషల్​ మీడియా (Social Media) ఇన్​ఫ్లూయెన్సర్లకు హైదరాబాద్ ​సీపీ (Hyderabad CP) సజ్జనార్​ పలు సూచనలు చేశారు. హాస్యం కోసం కాకుండా శక్తివంతమైన కంటెంట్​తో వీడియోలు చేయాలని ఆయన సూచించారు.

సజ్జనార్ సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటారనే విషయం తెలిసిందే. ఆయన ఆన్​లైన్​ బెట్టింగ్​పై కొంతకాలంగా యువతలో అవగాహన కల్పిస్తున్నారు. అలాగే రీల్స్​ కోసం ప్రమాదకరంగా స్టంట్లు చేస్తున్న యువతను హెచ్చరిస్తున్నారు. సోషల్​ మీడియాలో ఫేమస్​ కావడానికి ప్రమాదకర విన్యాసాలు చేయొద్దని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన చెబుతున్నారు. ఇటీవల ఆయన హైదరాబాద్​ సీపీగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో సోషల్​ మీడియా కంటెంట్​ క్రియేటర్లకు సూచనలు చేశారు.

CP Sajjanar | వాటికి వేదికగా మార్చాలి

సోషల్ మీడియాను మహిళా రక్షణ, డ్రగ్స్ వ్యతిరేక, సైబర్ క్రైమ్​ (Cyber Crime)పై అవగాహన కల్పించే రీల్స్, పోస్టులకు వేదికగా మార్చాలని సజ్జనార్​ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా పోస్టు చేశారు. లైక్స్ కాదు, జీవితాలను (లైవ్స్) కాపాడటమే ముఖ్యమన్నారు. సోషల్​ మీడియా కంటెంటర్స్​ ఇవాళ చేసే వీడియో రేపు ఒక జీవితాన్ని నిలబెడుతుందని సూచించారు.

కాగా చాలా మంది యువత ఫేమస్​ కావడానికి డబుల్​ మీనింగ్​ డైలాగ్​లు, అసభ్యకర వేషధారణతో రీల్స్​ చేస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది అయితే లైక్స్​ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి రీల్స్​ చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో సీపీ సజ్జనార్​ సూచనలు చేయడం గమనార్హం.