అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BC Reservations | తెలంగాణ రాజకీయం ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల చుట్టూ (Telangana Politics) తిరుగుతోంది. ఇదే అంశంపై ఇటు తెలంగాణ, అటు ఢిల్లీ కేంద్రంగా పోరాటం కొనసాగుతోంది. 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సోమవారం నుంచి హైదరాబాద్‌లో 72 గంటల దీక్ష చేపట్టగా, బీసీ బిల్లు ఆమోదానికి ఢిల్లీలో ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ నేతలతో కూడిన ప్రత్యేక రైలు రాజధానికి బయల్దేరింది. 6వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ ధర్నా చేయనుండగా, 8వ తేదీన బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కరీంనగర్ కేంద్రంగా బీసీ పోరాటానికి తెర లేపనుంది. ప్రధాన పార్టీలు బీసీ బిల్లు, రిజర్వేషన్ల కోసం పోరాడుతుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
BC Reservations | ఢిల్లీ బయల్దేరిన కాంగ్రెస్ నేతలు..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) కల్పిస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ పోరుబాట పట్టింది. రిజర్వేషన్ల సాధన కోసం ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టింది. బీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనుంది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు సోమవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ (Mahesh Kumar Goud), మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో పాటు పార్టీ శ్రేణులు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో దేశ రాజధానికి వెళ్లారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పార్టీ అధిష్టానం సహకారంతో విపక్ష నేతల సహకారంతో బీసీ బిల్లును ఆమోదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చ కోసం కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. అలాగే, రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు.
BC Reservations | హైదరాబాద్‌లో కవిత దీక్ష
ఇక, కొద్దిరోజులుగా బీసీ ఉద్యమాన్ని తలకెత్తుకున్న ఎమ్మెల్సీ కవిత తాజాగా హైదరాబాద్‌లో (Hyderabad) దీక్షకు దిగారు. బీఆర్ఎస్‌కు క్రమంగా దూరమవుతున్న ఆమె.. ఒంటరిగానే బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో బీసీ సదస్సులు నిర్వహించిన కవిత రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె 72 గంటల దీక్ష ప్రారంభించారు.
BC Reservations | 8న బీఆర్ఎస్ బీసీ సభ
ఇక, ఇన్నాళ్లు బీసీల విషయంలో ఎటూ తేల్చుకోలేక సతమతమైన బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఈ అంశంపై పోరాడాలని నిర్ణయించింది. రాజకీయ క్షేత్రంలో తాము వెనుకబడుతున్నామని గ్రహించిన గులాబీ పార్టీ ఆలస్యంగా కళ్లు తెరిచింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున బీసీలకు 42 శాతం టికెట్లు ఇస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Working President KTR) ఇటీవల ప్రకటించారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ నెల 8న కరీంనగర్ వేదికగా బీసీ శంఖారావానికి శ్రీకారం చుట్టింది. బీసీల గళం వినిపించేలా భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.
BC Reservations | సైలెంట్‌గా బీజేపీ
మరోవైపు, బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ప్రస్తుతానికి మౌనం వహిస్తోంది. కాంగ్రెస్ చెబుతున్న 42 శాతం రిజర్వేషన్లకు మద్దతు ప్రకటిస్తున్న కాషాయ పార్టీ.. మతపరమైన రిజర్వేషన్లు వ్యతిరేకిస్తోంది. 42 శాతం కోటా కేవలం బీసీలకు మాత్రమే ఇవ్వాలని, అందులో ముస్లింలను చేర్చవద్దని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ చెబుతున్న 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు కేటాయించడాన్ని బీజేపీ తప్పుబడుతోంది. మొత్తం 42 శాతం బీసీలకు మాత్రమే కేటాయిస్తే తాము కూడా మద్దతు తెలుపుతామని కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ స్పష్టం చేస్తోంది.
BC Reservations | కోటా అమలయ్యేనా?
వెనుకబడిన వర్గాల కోటా అంశంపై అన్ని పార్టీలు గళం వినిపిస్తున్నప్పటికీ అమలు సాధ్యాసాధ్యాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో బీసీలకు 42 శాతం కోటా సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు అమలు చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రేవంత్ సర్కారు 42 శాతం కోటా అమలుకు జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. బీసీ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్న తరుణంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని చెబుతున్నారు. అటు సుప్రీంకోర్టు ఆదేశాలు, ఇటు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వాదనల నేపథ్యంలోనే 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకపోవచ్చన్న భావన వ్యక్తమవుతోంది.