అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | తల్లితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న ఏడేళ్ల చిన్నారి ప్రయాణికుల రద్దీలో అదృశ్యమైంది. కామారెడ్డి పట్టణ పోలీసులకు (Kamareddy Police) సమాచారం రావడంతో ప్రత్యేక బృందలతో గాలించి కేవలం అరగంటలో చిన్నారి ఆచూకీ కనిపెట్టి తల్లికి అప్పగించారు. ఈ ఘటన శుక్రవారం కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం ఫరీద్ పేట గ్రామానికి చెందిన మహిళ శుక్రవారం తన పిల్లలతో కలిసి పాల్వంచ మర్రి వద్ద బస్సు ఎక్కి కామారెడ్డికి వస్తోంది. బస్సులో ప్రయాణికులు అధికంగా ఉండడంతో తనకు తెలియకుండానే మార్గమధ్యలో చిన్నారి బస్సులో నుంచి దిగిపోయింది. అనంతరం సదరు మహిళ కామారెడ్డి బస్టాండ్లో బస్సు దిగిన అనంతరం కూతురు కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. వెంటనే కామారెడ్డి పోలీసులకు సమాచారం చేరవేయగా.. పట్టణ సీఐ నరహరి (CI Narahari) విషయాన్ని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra), ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ నరహరి ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి బస్టాండ్ పరిసర ప్రాంతాలు, రహదారుల్లో సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు వేగంగా స్పందించడంతో కేవలం అరగంట వ్యవధిలోనే తప్పిపోయిన చిన్నారిని సురక్షితంగా గుర్తించి ఆమె తల్లి చెంతకు చేర్చారు. తప్పిపోయిన ఏడేళ్ల చిన్నారిని అతి తక్కువ సమయంలో గుర్తించి తల్లికి అప్పగించినందుకు సీఐ నరహరితో పాటు ప్రత్యేక బృందం సిబ్బందిని ఎస్పీ అభినందించారు.