అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | పోలీస్ స్టేషన్‌కు రాలేని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న బాధితుల వద్దకే పోలీసులు వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడి నుంచే కేసు నమోదు చేసి భరోసా కల్పిస్తారని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. దోమకొండ పోలీస్ స్టేషన్(Domakonda Police Station)ను ఎస్పీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రోల్ కాల్‌ను స్వయంగా పరిశీలించి, సిబ్బంది హాజరు, విధుల్లో పాటించాల్సిన క్రమశిక్షణ, సమయపాలనపై అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
SP Rajesh Chandra | మెరుగైన సేవలందించాలి
ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలందించాలని, విధుల పట్ల అంకితభావంతో ఉండాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ (Telangana Police) శాఖ ప్రజలకు మరింత సులభమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు నూతన కార్యాచరణను అమలులోకి తీసుకువచ్చిందన్నారు. ఇకపై బాధితుల ఇళ్ల వద్దకే పోలీసులు వచ్చి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తారని తెలిపారు.
SP Rajesh Chandra | అట్రాసిటీ నిరోధక చట్టం
ఈ విధానం శారీరక దాడులు, అట్రాసిటీ నిరోధక చట్టం కేసులు, బాల్య వివాహాలు, ర్యాగింగ్, మైనర్ వేధింపులు, గృహహింస వంటి కేసుల్లో బాధితులకు ఎంతో సహాయపడుతుందన్నారు. ఫోన్‌కాల్, ఆన్‌లైన్ అభ్యర్థన, ఇతర మార్గాల ద్వారా సమాచారం అందగానే సంబంధిత పోలీస్ సిబ్బంది బాధితుల నివాసానికి చేరుకుని ఫిర్యాదు నమోదు చేస్తారని తెలిపారు.
ఈ సేవల ద్వారా ఫిర్యాదుల నమోదు మరింత వేగవంతమవడంతో పాటు పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందని తెలిపారు. అనంతరం, జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జిల్లాలోని అధికారులందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూతన కార్యాచరణ అమలుపై పటిష్టమైన దిశానిర్దేశం చేశారు. బాధితుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించడంలో అధికారులు, సిబ్బంది పాటించాల్సిన బాధ్యతలను, విధివిధానాలను సమగ్రంగా వివరించారు. క్షేత్రస్థాయిలో ఈ విధానం విజయవంతం కావాలని, తద్వారా సామాన్య ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులకు పోలీస్ సేవలపై మరింత నమ్మకం కలిగించాలని అధికారులను ఆదేశించారు.