అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Police | సినీ ఇండస్ట్రీకి సవాలుగా మారిన పైరసీ భూతాన్ని అరికట్టేందుకు సైబర్ క్రైం పోలీసులు దృష్టి సారించారు. సినిమా, ఓటీటీ పైరసీ కేసులో సీరియస్‌గా దర్యాప్తు చేపట్టారు. ఐబొమ్మ(IBOMMA) లాంటి వెబ్‌సైట్లతో పాటు పైరసీ చేస్తున్న వారిపై నిఘా పెట్టారు.
ఇటీవల థియేటర్‌లో రికార్డ్ చేసే వారితో పాటు సర్వర్లు హ్యాక్ చేస్తున్న ప్రధాన నిందితులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ మనుగడకే ప్రమాదకరంగా మారిన పైరసీని అరికట్టాలని చాలా కాలంగా సినీ ప్రముఖులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, ఇటీవల విడుదలైన చిత్రాలు ఆన్‌లైన్‌లో దర్శనమివ్వడంతో సైబర్ క్రైమ్ పోలీసులు(Cyber Crime Police) సీరియస్‌గా రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో థియేటర్లలో చిత్రాలు రికార్డింగ్ చేస్తున్న వారితో పాటు సర్వర్లు హ్యాక్ చేస్తున్న వారిని అరెస్టు చేశారు. అలాగే, మిగతా సైట్లపైనా దృష్టి సారించారు.
Hyderabad Police | అంతర్జాతీయ స్థాయికి..
ఇటీవలి కాలంలో తెలుగుతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించింది. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ వంటి సిఉనిమాలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటాయి. అలాగే, పుష్ప వంటి సినిమాలు రికార్డులు కొల్లగొట్టాయి. కాంతార, దృశ్యం వంటి చిత్రాలు కూడా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి భారత సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. వందలు, వేల కోట్ల రూపాయలు వెచ్చించి పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇటీవలి కాలంలో పాన్ ఇండియా చిత్రాలు ఎక్కువగా దక్షిణ చిత్ర పరిశ్రమల నుంచే వస్తున్నాయి. టాలీవుడ్, మాలీవుడ్, కోలివుడ్ తదితర ఇండస్ట్రీలు దూసుకెళ్తుండగా, బాలీవుడ్ కాస్త వెనుకబడింది.
Hyderabad Police | రూ.కోట్లల్లో నష్టం..
అయితే, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న మన చిత్రాలకు పైరసీ భూతం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. వందల కోట్ల పెట్టుబడి పెట్టి హాలీవుడ్ రేంజ్‌లో నిర్మిస్తున్న చిత్రాలు విడుదలైన నిమిషాల్లోనే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. సినిమాలతో పాటు ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీసులు సైతం గంటల వ్యవధిలోనే పైరసీ అవుతున్నాయి. సులువుగా సంపాదనకు అలవాటు పడ్డ కొందరు అక్రమార్కులు సినిమాలను పైరసీ చేస్తున్నారు. ఈ పైరసీ వల్ల ఒక్క 2024లోనే తెలుగు సినీ పరిశ్రమ దాదాపు రూ.3,700 కోట్లు నష్టపోయిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(Hyderabad CP CV Anand) ఇటీవల ప్రకటించారు. థియేటర్లలో రహస్యంగా రికార్డింగ్ చేయడం, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ సర్వర్‌లను హ్యాక్ చేసి హెచ్‌డీ ప్రింట్‌లను దొంగిలించడం వంటి రెండు పద్ధతుల్లో వీరు పైరసీకి పాల్పడుతున్నారు. ఈ పైరసీ సైట్(Piracy Site)లకు ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ప్రకటనల ద్వారా కోట్ల రూపాయల నిధులు అందుతున్నాయని ఈ లావాదేవీలన్నీ క్రిప్టోకరెన్సీ ద్వారా జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.
Hyderabad Police | రంగంలోకి సైబర్ క్రైం..
సినిమా ఇండస్ట్రీ(Film Industry) భవిష్యత్తుతో పాటు థియేటర్ల భవితవ్యానికి ప్రమాదకరంగా మారిన పైరసీని నియంత్రించేందుకు పోలీసులు నడుం బిగించారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు థియేటర్లలో కెమెరాలతో సినిమాలు రికార్డు చేసే దశ నుండి, ఇప్పుడు ఏకంగా డిజిటల్ మీడియా హౌస్ సర్వర్లను హ్యాక్ చేసి సినిమా ప్రింట్లను దొంగిలిస్తున్న వారిని సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. తాజాగా ఐబొమ్మ నిర్వాహకులను కట్టడి చేయడంపై దృష్టి సారించారు. నిన్నటి వరకు హైదరాబాద్ సీపీ గా పని చేసిన సీవీ ఆనంద్ ఐబొమ్మ వెబ్‌సైట్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వెబ్‌సైట్ నిర్వాహకులు తాజాగా పోలీసులకు సవాల్ విసరడం సంచలనంగా మారింది. అయితే, ఐబొమ్మ వెబ్‌సైట్‌పై పోలీసులు దృష్టి పెట్టడంతో దాని నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసరడం సంచలనం సృష్టించింది. దీంతో సీరియస్‌గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆ వెబ్‌సైట్ కోసం పని చేస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్లలో ఐబొమ్మకు ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించారు.