అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Plane Hijacked | దక్షిణ సూడాన్‌లో సహాయక విమానం హైజాక్ కావడం హాట్ టాపిక్ అయింది. జుబా నుంచి మైవుట్‌కు వైద్య సామగ్రిని తీసుకెళ్తున్న సెస్నా గ్రాండ్ కారవాన్ విమానాన్ని (Cessna Grand Caravan Aircraft) తుపాకీతో వచ్చిన దుండగుడు హైజాక్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అయితే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలోనే యాసిర్ మహమ్మద్ యూసఫ్ అనే వ్యక్తి తుపాకీతో విమానంలోకి ప్రవేశించాడు. మొదట వెనక క్యాబిన్‌లో దాక్కున్న అతడు, కొన్ని నిమిషాల తర్వాత బయటకు వచ్చి విమానాన్ని హైజాక్ చేస్తున్నట్లు ప్రకటించాడు. పైలట్‌ను బెదిరిస్తూ ఆఫ్రికా దేశం చాద్‌కు విమానాన్ని మళ్లించాలని ఆదేశించాడు.
Plane Hijacked | గంటల పాటు గాల్లోనే చక్కర్లు..
హైజాకర్ బెదిరింపుల నేపథ్యంలో విమానం కొన్ని గంటల పాటు గాల్లోనే తిరిగింది. పైలట్ పరిస్థితిని అర్థం చేసుకుని, తెలివిగా ఒక అబద్ధం చెప్పాడు. ఇంధనం చాలా తక్కువగా ఉంది… వెంటనే రీఫ్యూయెలింగ్ చేయాలి అని చెప్పి హైజాకర్ (Hijacker)ను నమ్మించాడు.అతడిని చాద్‌కు తీసుకువెళ్తున్నట్లు నటిస్తూ, విమానాన్ని వావు ప్రాంతంలో అత్యవసర ల్యాండింగ్ చేయించాడు. విమానాన్ని నేలకు దించే సరికి పైలట్ వెంటనే స్థానిక అధికారులకు విషయం తెలిపాడు. అప్రమత్తమైన భద్రతా దళాలు వెంటనే స్పందించి హైజాకర్‌ను ఎలాంటి ప్రతిఘటన లేకుండా అదుపులోకి తీసుకున్నాయి. ఈ మొత్తం ఘటనలో ఎవరూ గాయపడకపోవడం గమనార్హం.
నిందితుడు జుబా అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport)లో కార్యకలాపాలు నిర్వహించే ఓ చార్టర్ కంపెనీ లోగో ఉన్న చొక్కా ధరించి ఉన్నాడు. అయితే ఆ కంపెనీ విచారణ చేయగా, అతడు తమ ఉద్యోగి కాదని తేలింది. విమానయాన కంపెనీ ప్రతినిధి మెలిస్సా స్ట్రీక్‌ల్యాండ్ స్పందిస్తూ “విమానాన్ని సురక్షితంగా తిరిగి తీసుకొచ్చిన భద్రతా దళాలకు కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.యాసిర్ మహమ్మద్ యూసఫ్ ఈ హైజాక్‌కు ఎందుకు పాల్పడ్డాడన్న విషయంపై అధికారులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
