అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో (District Police Office) డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో సోమవారం నెలవారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, తీవ్రమైన కేసుల్లో ఎస్‌వోపీని కచ్చితంగా పాటిస్తూ వేగవంతమైన దర్యాప్తు చేయాలని సూచించారు.
SP Rajesh Chandra | ఆస్తి సంబంధిత నేరాల్లో..
2025లో జరిగిన ఆస్తి సంబంధిత నేరాల్లో 45శాతం ఛేదించగా, 40శాతం ఆస్తి రికవరీ చేసి బాధిత కుటుంబ సభ్యులకు చేరవేసినట్లు ఎస్పీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఎస్పీ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల (Road Accidents) నివారణపై వాహనదారులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
SP Rajesh Chandra | చైనామాంజా విషయంలో కఠినంగా..
రానున్న సంక్రాంతి పండుగను (Sankranti Festival) పురస్కరించుకుని పక్షుల ప్రాణాలు, మనుషులకు ముప్పు కలిగించే చైనా మాంజా వినియోగం ఎక్కడా లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. పండుగ ముసుగులో కోడిపందేలు, పేకాట ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఏమాత్రం అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు.
SP Rajesh Chandra | రౌడీ షీటర్ల కదలికలపై..
ఎస్‌హెచ్‌వోలు, విలేజ్ పోలీస్ అధికారులు ప్రతి గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులతో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ముందస్తు సమాచారాన్ని సేకరించి చిన్న ఘటనలకైనా తక్షణమే స్పందించాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని, బ్లూకోల్ట్స్, నైట్ పెట్రోలింగ్ సిబ్బంది పాపిలోన్ డివైస్ల ద్వారా అనుమానితుల వేలిముద్రలను సేకరించాలన్నారు. మహిళా భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూనే, డ్రంకన్ డ్రైవ్ (Drunken Driving) తనిఖీలను ముమ్మరం చేయాలని సూచించారు.
SP Rajesh Chandra | పారదర్శకంగా పోలీసు సేవలు..
డయల్ 100 కాల్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు భరోసా కల్పించాలని ఎస్పీ ఆదేశించారు. ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యమని, పారదర్శక సేవలే పోలీసుల లక్ష్యమని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy), డీఎస్పీలు శ్రీనివాసరావు, విఠల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మదూసుధన్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ మురళి, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ నరేష్, సీసీయస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.