అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLC Hariprasad | పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ పాలిటికల్ సీన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నేతృత్వంలో పార్టీ కార్యకలాపాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో, స్థానిక జనసేన ఇంచార్జ్ మారుతారా? అనే ప్రశ్న స్థానికంగా చర్చనీయాంశం అయింది.
ప్రస్తుతం పిఠాపురం జనసేన ఇంచార్జ్‌గా ఉన్న మర్రెడ్డి శ్రీనివాసరావు(Marreddy Srinivasa Rao)పై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా , పార్టీ నాయకత్వానికి ఆయనపై పూర్తి విశ్వాసం ఉందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఆయన స్థానికంగా అంత చురుగ్గా ఉండకపోవడం, తక్కువ సాన్నిహిత్యం వల్ల నేతల్లో అసంతృప్తి ఉన్నట్లు సమాచారం.
MLC Hariprasad | కొత్తవారికి ప్రాధాన్యత?
వైసీపీ, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాత నాయకుల్లో ఆగ్రహం నెలకొంది. ముఖ్యంగా ఇటీవల చెబ్రోలు సీతారామాలయంలో జరిగిన జేఘంట ఘటనలో ఈ విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి. పార్టీ నేతలు మధనపడుతున్నా, వారి గొడవలు అధిష్టానం వరకు చేరడం లేదన్న భావన కూడా ఉంది. ఇటీవల పిఠాపురం పర్యటనకు వచ్చిన ఎమ్మెల్సీ హరిప్రసాద్(MLC Hariprasad) మీడియాతో మాట్లాడుతూ, ఇంచార్జ్ మార్పుపై పార్టీకి ఇప్పట్లో ఎలాంటి ఆలోచనలేవని స్పష్టం చేశారు.పార్టీలో అంతర్గతంగా ఇబ్బందులు ఉండటం సహజం. అవన్నీ చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం. మార్రెడ్డి శ్రీనివాసరావే ఇంచార్జ్ అంటూ తేల్చి చెప్పారు.
మత్స్యకారుల సమస్యలపై స్పందిస్తూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలోనే పిఠాపురంలో పర్యటించి ప్రత్యక్షంగా మాట్లాడనున్నారని, ఆ సమయంలో నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని హరిప్రసాద్ తెలిపారు.పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, పిఠాపురం నియోజకవర్గంలోని మండల, గ్రామ కమిటీల్లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. సుదీర్ఘకాలంగా పదవుల్లో కొనసాగుతున్న నాయకుల్లో కొంతమందిని పక్కకు జరిపే యోచనలో పార్టీ ఉందని తెలిసింది. అయితే ఇంచార్జ్ మార్పుపై ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, పిఠాపురంలో రాజకీయంగా ఎదిగేందుకు జనసేన కీలకంగా ఆలోచన చేస్తోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పర్యటన తర్వాత పార్టీ రాజకీయ దిశపై స్పష్టత రావొచ్చు.