అక్షరటుడే, హైదరాబాద్: Phone Tapping Case | తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (Special Investigation Team – SIT) తాజాగా మరో ముందడుగు వేసింది. మాజీ మంత్రి, భారాస సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్‌రావుకు నోటీసులు జారీ చేసింది. రేపు (మంగళవారం, జనవరి 20) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ Jubilee Hills Police Station లో విచారణకు హాజరుకావాలని సదరు నోటీసులో సిట్ ఆదేశించింది.
Phone Tapping Case | అసలు ఏం జరిగిందంటే..
గత భారాస ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, అధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే ఆరోపణల వల్ల ఈ కేసు నమోదైంది. వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడంతోపాటు చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఫిర్యాదులు రావడంతో.. విచారణకు తెలంగాణ సర్కారు సిట్‌ను నియమించింది. సర్కారు నియమించిన సిట్ ఇప్పటికే పలువురు కీలక అధికారులను విచారించింది.
Phone Tapping Case | హరీష్‌రావుకు నోటీసులు ఎందుకంటే..
సిట్ బృందం ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సమాచారం సేకరించేందుకే హరీష్‌రావును విచారించనున్నట్లు తెలుస్తోంది. గతంలో హరీష్‌రావు నిర్వహించిన శాఖలు, అప్పట్లో ఉన్న అధికారులతో పరిపాలనా పరంగా సంబంధాలపై స్పష్టత కోసం నోటీసు ఇచ్చినట్లు సమాచారం. కేవలం ఇది కేసు విచారణలో భాగంగా మాత్రమేనని, ఆరోపణలు నిర్ధారించబడలేదని పేర్కొంటున్నారు.
తీవ్ర విమర్శలు..
హరీష్‌రావుకు సిట్ నోటీసు జారీ చేయడంపై రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారాస మధ్య ఆరోపణలు – ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఇది చట్టపరమైన దర్యాప్తు అని అధికార పార్టీ వారు పేర్కొంటుండగా.. ఇది రాజకీయ కక్ష సాధింపేనని భారాస నేతలు విమర్శిస్తున్నారు. కాగా, హరీష్‌రావు మాత్రం తాను చట్టాన్ని గౌరవిస్తానని, విచారణకు తన వంతుగా సహకరిస్తానని చెప్పినట్లు చెబుతున్నారు.
రేపటి విచారణ కీలకం..
రేపటి సిట్ విచారణలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి హరీష్‌రావు ఇచ్చే వివరణ కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. హరీష్‌రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే సిట్ తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్లు సమాచారం. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా, న్యాయపరంగా ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.