అక్షరటుడే, హైదరాబాద్: Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు Harish Rao కు సిట్ (Special Investigation Team – SIT) నోటీసులు పంపడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసిందని గుర్తుచేశారు.
అత్యున్నత న్యాయస్థానం తీర్పుతోనే ఈ డ్రామా ముగిసిపోయినా, మళ్లీ హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత దిగజారిందో అర్థమవుతోందన్నారు. రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డికి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని ఈరోజు బయటపెట్టినందుకే, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ‘డైవర్షన్ పాలిటిక్స్’ తప్ప మరొకటి కాదని కేటీఆర్ విమర్శించారు.
Phone Tapping Case | ప్రశ్నిస్తూనే ఉంటాం..
విచారణల పేరుతో, నోటీసులతో ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తే అది వారి భ్రమ మాత్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. వారి వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. రేవంత్ సర్కారును అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటామని, ఇలాంటి చౌకబారు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.