అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kerala | కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాలో జరిగిన ఓ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. బస్సులో మహిళను అసభ్యంగా తాకాడంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో, ఆ ఆరోపణలను తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన సోషల్‌మీడియా బాధ్యత, వ్యక్తిగత పరువు, న్యాయపరమైన కోణాలపై పెద్ద చర్చను రేకెత్తిస్తోంది.కోజికోడ్ జిల్లా (Kozhikode District) గోవిందపురం గ్రామానికి చెందిన దీపక్ (42) జనవరి 16న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో, శిమ్జిత అనే మహిళ తనతో పాటు మరో మహిళను అతడు అసభ్యంగా తాకాడని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసింది. రద్దీగా ఉన్న బస్సులో దీపక్ మోచేతితో మహిళ శరీరాన్ని తాకినట్లు వీడియోలో కనిపించింది. ఈ వీడియోను ఆమె సోషల్‌మీడియా (Social Media)లో పోస్టు చేయడంతో అది వేగంగా వైరల్ అయి, 20 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.
Kerala | పరువు పోయిందని ఆత్మహత్య..
వీడియో వైరల్ అయిన తర్వాత దీపక్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పరువు పోయిందనే భావనతో అతడు పూర్తిగా కుంగిపోయాడని తెలిపారు. కుటుంబ సభ్యులు అతడికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఆదివారం ఉదయం అతడు తన గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా దీపక్ విగతజీవిగా కనిపించాడు.ఈ ఘటనకు కారణం సోషల్‌మీడియాలో వైరల్ అయిన వీడియోనేనని దీపక్ కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆరోపిస్తున్నారు. “నిజం పూర్తిగా తెలియకుండా వీడియోలు పోస్ట్ చేయడం వల్ల ఒక మనిషి ప్రాణం పోయింది. ఎవరి జీవితాలతో ఇలా ఆడుకోవద్దు” అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, సోషల్‌మీడియాలో పలువురు నెటిజన్లు దీపక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. బస్సులో తీవ్రమైన రద్దీ కారణంగా అనుకోకుండా తాకి ఉండొచ్చని, ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే శిమ్జిత మాత్రం ఈ వాదనలను ఖండించారు. తాను గమనించిన తర్వాతే వీడియో తీశానని, అతడు ఉద్దేశపూర్వకంగానే అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె స్పష్టం చేశారు. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడని తాను ఊహించలేదని కూడా పేర్కొన్నారు.ఈ ఘటనపై పురుషుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న కార్యకర్త రాహుల్ ఈశ్వర్ స్పందించారు. సోషల్‌మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం, డీజీపీ కార్యాలయానికి (DGP Office)ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తప్పుడు లేదా అపూర్ణ సమాచారం ఆధారంగా కంటెంట్ సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
బస్సులో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ వీడియో తీసి వైరల్ చేసిన యువతి
నిందారోపణ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బాధితుడు
కేరళ – బస్సులో దీపక్ అనే వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ తాకాడు అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఓ యువతి
వీడియో వైరల్ కావడంతో అవమాన భారంతో తాను… pic.twitter.com/9ZBJHpRdiY
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2026