అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారని మండి పడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కోస్గీ సభలో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా’ అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు (Palamuru project) గొంతుకోసి, సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ కూతలు కూస్తున్నావ అన్నారు. తెలంగాణ సోయిలేని.. రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకు రేవంత్ రెడ్డిది అన్నారు.
KTR | దొరికిపోవడం అలవాటే..
అడ్డంగా దొరికిపోవడం.. ఆగమాగం కావడం..అడ్డదిడ్డంగా వాగడం రేవంత్‌రెడ్డికి అలవాటే అన్నారు. నీటి హక్కులపై రాజీపడ్డ నిర్వాకాన్ని బయటపెడితే తట్టుకోలేక.. చిల్లర డైలాగ్లతో చిందులు తొక్కుతున్నారని విమర్శించారు. విధ్వంసక పాలనతో ప్రజలను చావ గొడుతున్న సీఎం రేవంత్, వికృత మనస్తత్వంతో చావులు కోరుతున్నారని మండిపడ్డారు. ‘సభ్యత, సంస్కారంలేని నీచమైన నీ వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నా.. ఛీకొడుతున్నా ఇంకా మారవా’ అన్నారు. పట్ట పగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు దొంగవు అని విమర్శించారు.
పనికిమాలిన శపథాలు చేయడం.. పత్తాలేకుండా పారిపోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని కేటీఆర్ అన్నారు. రైతన్నల హక్కులకు భంగం కలిగతే భగ్గున మండుతామన్నారు. తిట్లు.. బూతులతో డైవర్షన్ డ్రామాలు ,తమాషాలు ప్రతీ సారి నడవవు అని హెచ్చరించారు. 2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని అన్నారు. మళ్లా వందేండ్ల దాకా పుట్టగతులు లేకుండా పాతిపెట్టడం తథ్యమని తెలిపారు.
KTR | దివాలా తీసిన రాజకీయాలు
వాదనలు విఫలమై, వాస్తవాలు అదృశ్యమైనప్పుడు వ్యక్తిగత దూషణ దివాలా తీసిన రాజకీయాలకు చివరి ఆశ్రయంగా మారుతుందని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఈ దూషణ రాజకీయాలను గమనిస్తోందన్నారు. పాలనపై దార్శనికత, సమాధానాలు లేనప్పుడు, వాగ్దానాలపై, ప్రజాస్వామ్య చర్చలపై గౌరవం లేనప్పుడు, బురద జల్లడం తప్పించుకోవడానికి సులభమైన మార్గం అవుతుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి అహంకారం, అసభ్య పదజాలాన్ని తెలంగాణ ప్రజలు క్షమించరని చెప్పారు. అది ఖచ్చితంగా 2028 ఎన్నికలలో ప్రతిబింబిస్తుందన్నారు.