అక్షరటుడే, కామారెడ్డి : PD Act | అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠాపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు తాజాగా మంగళవారం ముఠాలోని మరొక ఇద్దరు సభ్యులపై పీడీ యాక్ట్ నమోదు చేసి ఉత్తర్వులను నిందితులకు అందజేసినట్టు ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు.
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైన్స్ షాప్‌లలో (Wine Shop) రెండు నకిలీ రూ.500 నోట్లు వినియోగించిన కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తెలంగాణతో (Telangana) పాటు పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రధాన నిందితుడు లఖన్ కుమార్ దుబే, యూపీకి చెందిన సత్యదేవ్ యాదవ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సౌరవ్డేలపై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు.
యూపీకి చెందిన దివాకర్ చౌదరి అలియాస్ బ్రిజేష్ కుమార్ గుప్తా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన హరి నారాయణ భగత్ అలియాస్ సంజయ్‌లపై మంగళవారం పీడీ యాక్ట్ నమోదు చేశారు. నిందితులు ప్రస్తుతం నిజామాబాద్ సెంట్రల్ జైళ్లలో నిర్బంధంలో ఉండగా కామారెడ్డి కలెక్టర్ జారీ చేసిన పిడీ యాక్ట్ ఉత్తర్వులను కామారెడ్డి టౌన్ సీఐ నరహరి (Kamareddy Town CI Narahari), హెడ్ కానిస్టేబుల్ వీఎల్ నర్సింలు జైలులో ఉన్న నిందితులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నకిలీ కరెన్సీ (Fake Currency) చలామణి ద్వారా ప్రజల్లో భయం, ఆర్థిక అస్థిరత సృష్టించే వారిని అరికట్టడంలో పీడీ యాక్ట్ కీలకమైన చట్టమన్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం నిందితులు ఒక ఏడాది వరకు బెయిల్ లేకుండా జైల్లోనే నిర్బంధంలో ఉండనున్నారని తెలిపారు. నకిలీ కరెన్సీ నేరాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు జిల్లా పోలీసులు ఉక్కుపాదంతో వ్యవహరిస్తున్నారని, ఇటువంటి తీవ్రమైన ఆర్థికనేరాలపై ఎటువంటి సడలింపు ఉండదని స్పష్టం చేశారు. నకిలీ నోట్ల ముఠాలు అమాయక ప్రజలను మోసం చేయడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయగలవని, ఇలాంటి నేరగాళ్లపై కామారెడ్డి పోలీసులు (Kamareddy Police) కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంటారన్నారు.
