అక్షరటుడే, కామారెడ్డి: PD Act | అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా సభ్యుల్లో ఒకరిపై పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని ఓ వైన్ షాప్‌లో (wine shop) రెండు నకిలీ 500 నోట్లు వినియోగించిన ఘటనపై మేకల అఖిల్ గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో కేసును దర్యాప్తు చేసిన జిల్లా పోలీసులు.. తెలంగాణ, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించారు. మొత్తం 8 మంది నిందితులను అక్టోబర్ 11న అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రధాన నిందితుడు కరెన్సీ కాట్ని అలియాస్ లఖన్ కుమార్ దుబేపై కామారెడ్డి, కోల్‌కతాలో కూడా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇతను నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఉండగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను కామారెడ్డి టౌన్ సీఐ నరహరి, హెడ్ కానిస్టేబుల్ నర్సింలు నిందితునికి అందజేశారు.
ఫేక్ కరెన్సీ (fake currency) చలామణి ద్వారా ప్రజల్లో భయం, అనిశ్చితిని సృష్టిస్తూ, సమాజ అశాంతి నెలకొల్పుతున్న నేపథ్యంలో తిరిగి శాంతి భద్రతను పునరుద్ధరించాలనే ఉద్దేశ్యంతో పీడీ యాక్ట్‌ను అమలు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ చట్టం ప్రకారం నిందితుడు ఒక ఏడాది వరకు నిర్బంధంలో ఉండే అవకాశం ఉందన్నారు.
అమాయక ప్రజలను మోసం చేసి, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా అక్రమంగా డబ్బులు సంపాదించేలా తరచూ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో అస్థిరత, భయం సృష్టించే వారిని నిర్బంధించేందుకు పీడీ యాక్ట్‌ను అమలు చేస్తామన్నారు. నేరాలు మానుకుని బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని చెప్పారు.
