అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PCC Chief | కేటీఆర్, హరీష్ రావుకు దమ్ముంటే అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Pradesh Congress Committee) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై బట్ట కాల్చి మీదవేసే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలపై చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. పసలేని ఆరోపణలు చేసి పారిపోతామంటే కుదరదన్నారు. బీఆర్ఎస్ అవినీతిపై దర్యాప్తులు జరుగుతున్నాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అధికారంలోకి వచ్చాక సింగరేణితో పాటు అనేక సంస్థలను ప్రక్షాళన చేసి సంస్థ బలోపేతం కోసం మార్గదర్శకాలు జారీ చేశామన్నారు.
PCC Chief | పదేళ్ల తప్పులు బయటకు..
బీఆర్ఎస్ నాయకులు గత పదేళ్ల కాలంలో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Bomma) అన్నారు. సింగరేణిలో జరిగిన కాంట్రాక్ట్‌లు బీఆర్ఎస్ హయంలోనే జరిగాయని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
PCC Chief | కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అంచనాలు..
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అంచనాలు ఎలా పెంచారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేసే ప్రతీ ఆరోపణలకు తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో టెలిగ్రాఫ్ చట్టంలో (Telegraph Act) ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) అనేది అత్యంత భయంకరమైనదన్నారు. సొంత పార్టీ నాయకులపై సైతం ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఎలాంటి చర్చకైన సిద్ధంగా ఉన్నామన్నారు. రేపు జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు. దేవుళ్ల పేరుతో ఓట్లు అడిగే వాళ్లం కాదని.. దేవుళ్ల పేరుతో రాజకీయం చేసే మీరు ఎలాంటి అభివృద్ధి చేశారని మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ నేతలను ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
PCC Chief | విద్యావైద్యంపై ప్రత్యేక దృష్టి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సాధించిందని ఆయన అన్నారు.. స్వార్థ రాజకీయాల కోసం దేవుళ్ల పేర్లను వాడుకోవద్దని మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు. కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీ నిజామాబాద్‌ను ఎంపీ అర్వింద్ ఏం అభివృద్ధి చేశారని ఆయన ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్ జీవితం కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అని ఆయన వ్యాఖ్యానించారు. ప్యాకేజీలపై ఆధారపడిన జీవితం తనది కాదన్నారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, తాహెర్ బిన్ హందాన్, నుడా ఛైర్మన్ కేశ వేణు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.