అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Parliament Sessions | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 19 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులు ప్రవేశ పెట్టనుంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.
Parliament Sessions | కేంద్ర మంత్రులు
రాజ్‌నాథ్, కిరణ్ రిజిజు నేతృత్వంలో మీటింగ్ జరిగింది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష పార్టీలను కేంద్రం కోరింది. కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీ, డీఎంకేకు చెందిన టీఆర్ బాలు, టీఎంసీకి చెందిన డెరెక్ ఓబ్రియన్, ఐయూఎంఎల్‌కు చెందిన మహమ్మద్ బషీర్ పాల్గొన్నారు.
Parliament Sessions | వాడీవేడిగా సాగే అవకాశం
పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది. ఓటరు జాబితా సవరణ ఎస్ఐర్, ఢిల్లీ బాంబు పేలుడు (Delhi Bomb Blast) అంశాలపై విపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది. అలాగే కేంద్రం సభ ముందుకు పౌర అణు ఇంధన రంగంలో ప్రైవేటు రంగానికి ఆహ్వానం పలికేందుకు ఉద్దేశించిన ‘ది ఆటమిక్ ఎనర్జీ బిల్లు-2025’తో సహా 10 కీలక బిల్లులు ప్రవేశ పెట్టనుంది. భారత ఉన్నత విద్యా కమిషన్ బిల్లు, ఎనిమిది ఇతర ముసాయిదా చట్టాలు ఎజెండాలో ఉన్నాయి. జాతీయ రహదారుల (సవరణ) బిల్లును ప్రవేశపెట్టడానికి కూడా జాబితా చేయబడింది. ఇది జాతీయ రహదారుల కోసం వేగవంతమైన, పారదర్శకమైన భూసేకరణను నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది. మరొక ప్రతిపాదిత చట్టం కార్పొరేట్ చట్టాలు (సవరణ) బిల్లు, 2025, ఇది వ్యాపారాన్ని సులభతరం చేయడానికి కంపెనీల చట్టం, 2013 LLP చట్టం, 2008లను సవరించడానికి దీనిని తీసుకు రానున్నారు. సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు (SMC) కూడా సభలో ప్రవేశ పెట్టనున్నారు. ప్రభుత్వం ఆర్బిట్రేషన్, రాజీ చట్టంలో కూడా మార్పులు చేయాలని యోచిస్తోంది.
