అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Road Accident | ఏపీలో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రతి ఒక్కరిని భయబ్రాంతులకి గురి చేస్తున్నాయి. బస్సులు, లారీలు రోడ్డు ప్రమాదానికి గురి కావడం అందులోని వారు సజీవ దహనం కావడం మనం చూస్తూనే ఉన్నాం.
తాజాగా ప్రకాశం జిల్లాలో ఒక భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెస్తవారిపేట మండలం (Bestavaripet Mandal) పెంచికలపాడు గ్రామ సమీపంలో రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒక లారీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం తీవ్రత, తదనంతరం చెలరేగిన మంటలు ప్రాంతంలో కలకలం రేపాయి.
Road Accident | ఎలా జరిగింది ప్రమాదం?
వివరాల ప్రకారం, అనంతపురం నుంచి టమాటా లోడ్‌తో రాజమండ్రి (Rajamundry) దిశగా వస్తున్న లారీ పెంచికలపాడు వద్దకు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా దాని టైరు పేలిపోయింది. టైరు పగిలిన ప్రభావంతో లారీ అదుపు కోల్పోయి ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ (Oil Tanker)పై దూసుకెళ్లింది. బలంగా ఢీకొట్టడం వలన టమాటాతో నిండిన లారీ బోల్తా పడింది. ఇక ఆయిల్ ట్యాంకర్ ముందుభాగం పూర్తిగా ఛిద్రమైంది. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ పైడికొండల దుర్గారావు (40) క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయారు. ఢీకొట్టిన కొన్ని క్షణాల్లోనే ట్యాంకర్‌లో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. బయటకు రావడానికి మార్గం లేకపోవడంతో డ్రైవర్ సజీవదహనమై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి (Devarapalli) పట్టణానికి చెందినవారని పోలీసులు గుర్తించారు.
దుర్గారావు విశాఖ సమీపంలోని పరవాడలోని ఒక డిపో నుంచి ఆయిల్ లోడ్ చేసుకుని తాడిపత్రిలోని సిమెంట్ పరిశ్రమ (Cement Industry)కు వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన టమాటా లారీ అదుపు తప్పడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే గిద్దలూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే ట్యాంకర్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమై రహదారిపై ఆయిల్, కూరగాయలు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసిన గిద్దలూరు పోలీసులు, రెండు లారీలను సీజ్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి టైరు పేలిపోవడమే కారణమా? లేక ఇతర సాంకేతిక లోపాలు ఉన్నాయా? అనేది విచారణలో భాగంగా పరిశీలిస్తున్నారు.