అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rahul Gandhi | లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. జాతీయ భద్రత విషయంలోనూ రాహుల్ నిర్లక్ష్యపు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సమయంలో ఎన్ని భారత వైమానిక దళానికి చెందిన ఎన్ని ఫైటర్ జెట్లను(Fighter jet) కోల్పోయిందని రాహుల్ ఇటీవల ప్రశ్నించడంపై బీజేపీ(BJP) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ భద్రత విషయంలో రాజీ పడేలా రాహుల్ వ్యవహరించడం మానుకోవాలని సూచించింది. అదే సమయంలో రాహుల్‌గాంధీ ప్రతిపక్ష నాయకుడా.. లేక పాకిస్తాన్‌కు సంబంధించి నిషాన్ ఏ పాకిస్తాన్‌గా వ్యవహరిస్తున్నారా? అని ఎద్దేవా చేసింది. అసలు రాహుల్‌గాంధీ భారత్ వెంట ఉన్నారా? లేక శత్రువుల వెంట ఉన్నారా? అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియ(Gaurav Bhatia) నిలదీశారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్‌పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.
Rahul Gandhi | మీరు భారత్ వైపా.. పాక్ వైపా?
“నేడు దేశం రాహుల్ గాంధీని అడుగుతోంది. ప్రధానమంత్రి(Prime Minister)తో అభిప్రాయ భేదాలు ఉండడం ఆమోదయోగ్యమే, అది ప్రజాస్వామ్యంలో భాగం. కానీ మీరు(రాహుల్) ప్రధానిపై ఉపయోగిస్తున్న భాష తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మీ ప్రకటనలు ఇప్పుడు పాకిస్తాన్ పార్లమెంట్‌లో చర్చనీయాంశమవుతున్నాయి. శత్రు దేశం భారత్(India)ను లక్ష్యంగా చేసుకోవడానికి కాంగ్రెస్ నాయకులను మాటలను ఉపయోగిస్తోంది. అయినప్పటికీ మీరు మౌనంగా ఉన్నారని” అని గౌరవ్ భాటియా మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఎవరి వైపు ఉన్నారో నిర్ణయించుకోవాలి. మీరు భారతదేశ ప్రతిపక్ష నాయకుడా లేక నిషాన్-ఎ-పాకిస్తానా? అన్నది దేశం చూస్తోంది. అది మీరే నిర్ణయించుకోవాలని హితవు పలికారు. పాకిస్తాన్(Pakistan)పై అద్భుత విజయం సాధించిన సందర్భంలో ఫైటర్ జెట్ల గురించి వివరాలను వెల్లడించడం వివేకం కాదని ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్ భారతి గతంలో చేసిన వ్యాఖ్యను గౌరవ్ భాటియా ఈ సందర్భంగా గుర్తు చేశారు.