అక్షరటుడే, కామారెడ్డి: Operation Muskan | ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా జిల్లాలో 68 మంది బాలలను గుర్తించడం జరిగిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh chandra) తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 68 మందిలో 30 మంది బాల కార్మికులు ఉండగా 38 మంది బడిబయటి పిల్లలు ఉన్నారని, ఇందులో 59 మంది బాలురు, 9 మంది బాలికలు ఉన్నారని తెలిపారు.
Operation Muskan | బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు..
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో రెండుసార్లు ఆపరేషన్ స్మైల్ (Operation Smile), ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించిందని ఎస్పీ పేర్కొన్నారు. దీంట్లో భాగంగా తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
అందులో భాగంగా జిల్లాలో ఈ ఏడాది జులై 1 నుండి 31 వరకు పోలీస్ శాఖ (Police department), చైల్డ్ వెల్ఫేర్ (Child Welfare), లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్ ప్రొటెక్షన్, రెవెన్యూ, హెల్త్, వివిధ శాఖల అధికారులతో జిల్లాలో టీంలుగా ఏర్పాడ్డామన్నారు. ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లావ్యాప్తంగా 68 మంది బాలబాలికలను గుర్తించి సీడబ్ల్యుసీ ముందు వారిని హాజరుపర్చామని వివరించారు.
Operation Muskan | తల్లిదండ్రులకు కౌన్సెలింగ్..
తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి పిల్లలను అప్పగించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో పని చేయిస్తున్న వారిపై 8 కేసులు నమోదు చేశామన్నారు. తరచూ బాలలతో పనులు చేయిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. వీధి బాలలను చూసినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం చేయడానికి సహకరించిన అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.